ప్రజాశక్తి - జీలుగుమిల్లి
మండలం వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ సర్వే ప్రారంభించినట్లు వైద్యాధికారిని సుష్మ తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం పాలాచర్ల, రాజవరం గ్రామంలో సిహెచ్‌ఒ.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఇంట్లో వారి ఆరోగ్య వివరాలు సేకరించి, అవసరమగు పరీక్షలు నిర్వహించామన్నారు. వీరికి త్వరలో నిర్వహించే మెడికల్ క్యాంప్‌లో పూర్తి స్థాయి వైద్యం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎంలు, ఆశాలు, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఉంగుటూరు:జగనన్న ఆరోగ్య సురక్షాపై ఉంగుటూరు మండలంలో మంగళవారం నుంచి గ్రామాల వారీగా సర్వే కార్యక్రమం మొదలైందని ఇన్‌ఛార్జి ఎంపిడిఒ యు.ఆంజనేయులు తెలిపారు. వెల్లమిల్లి పంచాయతీ పరిధిలో ఆరోగ్య, ఆశా, గ్రామ వాలంటీర్లు సహకారంతో ఇంటింటా సర్వే చేశారు. చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు కె.సుబ్బరాజు వర్మ, శ్రావణ్‌రెడ్డి సర్వే తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సుబ్బరాజు వర్మ మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటా సర్వే చేసి వాటి వివరాలను ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తే వారి వివరాలు నమోదు చేయాల్సి ఉందన్నారు. సర్వేలో గుర్తించిన వారికి ఈనెల 30 నుంచి వచ్చేనెల 29 వరకూ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల్లో, ప్రత్యేక డాకర్లుతో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం అయిన వారికి వైద్యంతో పాటు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వస్కా కుమార్‌రాజా, పంచాయతీ కార్యదర్శి బాలాజీ పాల్గొన్నారు.










