Oct 04,2023 21:26

అధ్వాన్నంగా ఉన్న కాలనీకు వెళ్లే రహదారి

ప్రజాశక్తి - సాలూరు : పట్టణానికి సంబంధించిన జగనన్న లేఅవుట్లలో ఇళ్లు నిర్మిస్తున్న లబ్దిదారులు నానా అగచాట్లు పడుతున్నారు. లేఅవుట్లలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరగకపోవడంతో లబ్దిదారుల జేబులకు చిల్లులుపడుతున్నాయి. సిమెంటు, ఇటుక, ఇనుము, పిక్క రాయి వంటి నిర్మాణ సామగ్రి ఇళ్ల స్థలాల వద్దకు చేర్చడానికి చేసిన ఖర్చు తడిసి మోపెడవుతోంది. సిసి రోడ్లు లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి రోడ్లు గుంతలుగా మారాయి. కొన్ని చోట్ల చెరువులను తలపించేలా రోడ్లు కనిపిస్తున్నాయి. దీంతో లబ్దిదారులు నిర్మాణంలో ఉన్న ఇళ్ల వద్దకు నిర్మాణ సామగ్రి చేర్చడం తలకు మించిన భారంలా మారింది. ఇంటర్నల్‌ రోడ్లు నిర్మించకుండా లబ్దిదారులను ఆదరాబాదరాగా ఇళ్లు నిర్మించాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టిన పేదలు నరకయాతన అనుభవిస్తున్నారు. నిర్మాణ సామగ్రిని ఇళ్ల వద్దకు చేర్చడానికి అనువుగా రోడ్లు లేకపోవడంతో ఆటో, ట్రాక్టర్‌ డ్రైవర్లు దూరంగా దించేస్తున్నారు. దీంతో లబ్దిదారులు నిర్మాణ సామగ్రిని వారి ఇళ్ల వద్దకు చేర్చడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. నెలిపర్తి-1, నెలిపర్తి -2 లేఅవుట్‌ లలో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నప్పటికీ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పేదలు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఏడాది క్రితం టెండర్లు
పట్టణానికి సంబంధించిన జగనన్న లేఅవుట్లలో ఇంటర్నల్‌ రోడ్లు నిర్మాణానికి టెండర్లు పిలిచి ఏడాదైంది. మున్సిపల్‌ ప్రజారోగ్య ఇంజనీరింగ్‌ శాఖ పర్యవేక్షణలో చేపట్టనున్న ఈ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నెలిపర్తి లేఅవుట్‌ -1లో ఇంటర్నల్‌ రోడ్లు కోసం రూ.18లక్షలు మంజూరయ్యాయి. నెలిపర్తి-2లో ఇంటర్నల్‌ రోడ్లు నిర్మాణానికి రూ.36లక్షలు మంజూరయ్యాయి. ఏడాది క్రితం టెండర్లు ఖరారయ్యాయి. కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో లేఅవుట్లలో ఇళ్లు నిర్మిస్తున్న లబ్దిదారులు నానా అగచాట్లు పడుతున్నారు.
నోటీసులు ఇచ్చినా స్పందించని కాంట్రాక్టర్లు
నెలిపర్తి లేఅవుట్లలో ఇంటర్నల్‌ రోడ్లు నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏడాదైనా పనులు ప్రారంభించలేదు. దీంతో సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు రెండు నోటీసులు జారీ చేశారు. సకాలంలో పనులు ప్రారంభించలేదని అధికారులు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. చేసిన పనులకు బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం తో కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది.
కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చాం
జగనన్న లేఅవుట్లలో ఇంటర్నల్‌ రోడ్లు నిర్మాణానికి టెండర్లు ఏడాది క్రితమే పిలిచాం. కాంట్రాక్టర్లు ఇంకా పనులు ప్రారంభించలేదు. రెండు నోటీసులు జారీ చేశాం. ప్రారంభించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటాం.
ఎల్‌.సూరినాయుడు,
ఇన్‌ఛార్జి డిఇ, మున్సిపాలిటీ