ప్రజాశక్తి - సాలూరు: పట్టణానికి సంబంధించిన బైపాస్ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తయింది. లాంఛన ప్రాయంగా ప్రారంభోత్సవం చేపట్టడమే తరువాయి. సుమారు రూ.36కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే అంతర్‌రాష్ట్ర వాహనాల రాకపోకలు సాగిపోతున్నాయి. ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలు ఇకపై పట్టణ నడిబొడ్డు మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరను న్నాయి. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. పట్టణానికి సంబంధించినంత వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చాలా అవసరమని అనేక ఏళ్లుగా ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కోరారు. పట్టణం నడిబొడ్డు మీదుగా జాతీయ రహదారి 26 వెళ్తుండడంతో ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వాహనాల రాకపోకలు సాగిస్తుండేవి. భారీలోడులతో లారీలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండేవి. ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు కత్తి మీద సాములా వుండేది. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతుండేవి. పట్టణం మీదుగా వెళ్లే రహదారి ఇరుగ్గా ఉండడంతో వాహనదారులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. వాయు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే పరిస్థితులు నెలకొన్నాయి. గత 20ఏళ్లు ఎమ్మెల్యేగా రాజన్నదొర ఉండడంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి బీజం పడింది. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బైపాస్ రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు మంజూరు చేయించారు. బైపాస్ నిర్మాణం చేస్తామని ప్రతి ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు హామీ లు గుప్పించి గాలికొదిలేశాయి. 40సంవత్సరాలుగా ఎదురు చూసిన పట్టణ వాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. అధికారికంగా ప్రారంభానికి సిద్ధంగా వుంది. అనధికారికంగా రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు సాగిపోతున్నాయి.దీనిపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










