Oct 08,2022 23:23

మృతుడు పవన్‌

గంభీరం రిజర్వాయర్‌లో మునిగి యువకుడు మృతి
మారికవలస శారదానగర్‌లో విషాదం
ప్రజాశక్తి -ఆనందపురం
: గంభీరం రిజర్వాయర్‌కు సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. వివరాలివి. మారికవలస శారదానగర్‌ చెందిన గిరిజాల పవన్‌ (21) తన స్నేహితులతో కలిసి శనివారం సరదాగా గంభీరం రిజర్వాయర్‌ వద్దకు వెళ్లారు. రిజర్వాయర్‌లో ఈతకు దిగగా, పవన్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. అతని స్నేహితులు వెంటనే స్థానికంగా ఉన్న గంభీరం యువకులకు సమాచారం అందించారు. వారు రిజర్వాయర్‌ వద్దకు చేరుకుని గాలించగా, అప్పటికే మృతి చెందిన పవన్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అందిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రిజర్వాయర్‌ వద్దకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సిఐ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ నరసింహమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన ఒక్కాగానొక్క కుమారుడు మృతితో శారదానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పిల్లలపై శ్రద్ధ వహించాలి : సిఐ
ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌లో చెరువులు, వాగులు, రిజర్వాయర్లు నీటితో నిండి ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను వాటి వద్దకు పంపకపోవడమే మంచిదని సిఐ రామచంద్రరావు హెచ్చరించారు. సెలవు రోజుల్లో స్నేహితులతో సరదాగా బీచ్‌లు, రిజర్వాయర్ల వద్దకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునేలా పిల్లలకు సూచనలు చేయాలన్నారు. అదే సమయంలో యువకులు, విద్యార్థులు సైతం విహారం పేరుతో బీచ్‌లుర రిజర్వాయర్లు వద్దకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.