ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రాణం విలువ ఎవరిదైనా ఒకటే. అయినప్పటికీ ప్రాణం ఖరీదులో వ్యత్యాసం చూపించి ఒకరి ప్రాణానికి రూ.9లక్షలు, మరొకరి ప్రాణానికి రూ.3లక్షలు విలువ కట్టిన సంఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం బొబ్బిలి గ్రోత్ సెంటర్లో డీజిల్ ట్యాంకు శుభ్రం చేసేందుకు దిగిన చింతాడ గ్రామానికి చెందిన పెద్దింటి పోలినాయుడు, అతడిని కాపాడేందుకు ట్యాంకులోకి దిగిన బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన అనుషు మరణించిన విషయం తెలిసిందే. మృతుని కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పెద్దింటి పోలినాయుడు స్థానికుడు కావడంతో రూ.9లక్షలు చెల్లించేందుకు పెట్రోల్ బంకు యాజమాన్యం అంగీకరించగా పాట్నాకు చెందిన అనుషుకు రూ.3లక్షలు చెల్లిస్తామని యాజమాన్యం చెప్పడంతో పలువురు ఆశ్చర్యానికి గురవు తున్నారు. ఇద్దరూ ఒకేసారి మృతి చెందినప్పటికీ ప్రాణానికి కట్టే విలువలో ఎందుకు వ్యత్యాసం చూపుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనుషు స్థానికుడు కాకపోతే ప్రాణం విలువ ఒకటి కాదా అని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరికి ఒకేలా నష్టపరిహారం చెల్లించాలని అనుషు కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు
డీజిల్ ట్యాంకులో దిగి మరణించిన బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన అనుషు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అనుషు కుటుంబ సభ్యులు ఆర్తనాదాలతో ఆసుపత్రి పరిసర ప్రాంతం మారుమోగింది. అనుషు తల్లిదండ్రులు బోరున విలపించారు. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ శవపంచనామా చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని పాట్నా తీసుకువెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానికులు సహకారంతో మృతదేహానికి పట్టణంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
తప్పుడు కేసు నమోదు చేయడం అన్యాయం
పెట్రోల్ బంకులో డీజిల్ ట్యాంకులో దిగి ఇద్దరు మరణిస్తే పోలీసులు యజమానిని కాపాడేందుకు సెక్షన్లు మార్చివేసి కేసు నమోదు చేయడం అన్యాయమని అంబేద్కర్ పోరాట సమితి అద్యక్షులు సొరు సాంబయ్య అన్నారు. డీజిల్ ట్యాంక్ శుభ్రం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ఇద్దరు మరణానికి కారణమైన పెట్రోల్ బంకు యజమానిపై 304లో పార్ట్-2, సపోర్టుగా 308 సెక్షన్ కింద కేసు నమోదు చేయాల్సిన ఉన్నప్పటికీ యజమానిని రక్షించేందుకు 304ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం అన్యాయమన్నారు. పెట్రోల్ బంకు యజమానికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికే సెక్షన్ మార్చి కేసు పెట్టారని, జిల్లా ఎస్‌సి కలుగజేసుకుని ఇద్దరి మరణానికి కారణమైన పెట్రోల్ బంకు యజమనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఇస్తున్న నష్టపరిహారంలో వ్యత్యాసం చూపడం దుర్మార్గమన్నారు. మృతుల కుటుంబాలకు ఒకే విధంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం చేస్తామన్నారు.










