మోడీ గారి స్వంత నియోజకవర్గమైన వారణాసి లోని ఎపెక్స్, మేక్స్వెల్, హెరిటేజ్ వంటి కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా రోగులను చేర్చుకోవడానికి, కనీసం టెస్టులు చేయడానికి కూడా నిరాకరించాయని నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏప్రిల్ 17వ తేదీన వార్త ప్రచురించింది. కార్పొరేట్ సంస్థలు ఎలా ఉంటాయో అనడానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. అదే సందర్భంలో నేడు ప్రజల ప్రజల ప్రాణాలకు రక్షగా నిలుస్తున్నది ప్రభుత్వ ఆసపత్రులే అన్నది కూడా ప్రజలు నిస్సందేహంగా గమనించారు. సంక్షోభాల కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నవి ప్రభుత్వ రంగ సంస్థలే. కార్పొరేట్ రంగ నిర్వాకం గమనించే నేడు ప్రపంచంలోని అనేక దేశాలు ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని ప్రవేటు సంస్థలను సైతం జాతీయం చేస్తున్నాయి. అయితే అదేం విచిత్రమో కానీ మోడీ ప్రభుత్వం మాత్రం కనీస విచక్షణ కూడా చూపడంలేదు.
కష్ట కాలంలోనే ఎవరిదైనా అసలు నైజం బయపడుతుందంటారు. కరోనా విజృంభిస్తున్న వేళ నేడు దేశంలో ఇదే జరుగుతోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రులందరికీ తమతమ పరిధి లోని ప్రభుత్వ రంగ సంస్థల న్నింటిలో కోవిడ్ పేషంట్లకు వైద్యం అందించేలా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఆసుప త్రులలో ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశంలో 19 కేంద్రాలలో ప్రత్యేక ఆసుపత్రులను ఆక్సిజన్, వెంటిలేటర్లు వంటి అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ఆధ్వర్యం లోని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్. డి.ఒ) ప్రకటించింది. దీనికనుగుణంగా దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాలలో అప్పుడే కొన్ని 500 పడకల ఆసుపత్రులు వాడుక లోనికి కూడా వచ్చాయి. భారతీయ రైల్వేకి సంబం ధించిన రైలు బోగీలను అత్య వసర వినియోగానికి అవసరమైన అన్ని వసతులతో కూడిన ఆసుపత్రి గదులుగా మార్చింది.
నేడు దేశం తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటోంది. దీనిని అధిగమించడానికి, దేశానికి వెన్నుదన్నుగా నిలవడానికి తెలుగు ప్రజలందరూ గర్వపడేలా మరో ప్రభుత్వ రంగ పరిశ్రమ నడుం బిగించింది. అదే మన ఆత్మగౌరవ ప్రతీక అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గత వారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు వైజాగ్ స్టీల్ 400 టన్నుల ద్రవ ఆక్సిజన్ ను సరఫరా చేసింది. అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర ప్రజల ప్రాణ రక్షణ కోసం మరో 100 టన్నుల ఆక్సిజన్ ను ప్రత్యేక రైలులో ముంబాయి పంపుతోంది. అవసరాన్ని బట్టి ఎంత ఆక్సిజన్ అయినా సరఫరా చేయడానికి స్టీల్ ప్లాంట్ సిద్ధంగా ఉందని సంస్థ అధికారులు ప్రకటించారు. గత సంవత్సరం కూడా స్టీల్ ప్లాంట్ 8,842 టన్నుల ద్రవ ఆక్సిజన్ ను దేశానికి అందించడం ద్వారా ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచి, తాము కేవలం ఉక్కును తయారు చేయడమే కాదు, ప్రజల ప్రాణాలకు సైతం ఉక్కు కవచంలా నిలుస్తామని సగర్వంగా చాటిచెప్పింది.
దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్కర పరిస్థితులలో సాధారణ పౌరులు ఒక ప్రశ్న తప్పకుండా వేసుకోవాలి. అదేమిటంటే మన దేశంలో అనేక బలమైన ప్రవేటు రంగ పరిశ్రమలుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ఏర్పాట్లకై ప్రభుత్వ రంగ పరిశ్రమలనే ఎందుకు ఆదేశించింది? ఎందుకు వీటి మీదే ఆధారపడింది? గత సంవత్సరం కోవిడ్ మొదటి దశ కాలంలో ప్రపంచంలోనే అత్యధిక లాభాలనార్జించిన అంబానీ, అదానీ లాంటి దిగ్గజ సంస్థలను ఎందుకు అడగలేకపోయింది? వీటికి సమాధానం కూడా స్పష్టమే. ఎందుకంటే ప్రభుత్వ రంగం సామాజిక స్పృహతో పనిచేస్తే, కార్పొరేట్ సంస్థలు మాత్రం కేవలం లాభాల స్పృహనే కలిగి ఉంటాయి. కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ, 15 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన వేళ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేల కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామాలను పయనమైన వేళ కూడా కోట్లాది మంది ఈ సంపద సృష్టికర్తలు ఆర్తనాదాలు జోలికి పోకుండా, ఆ సమయాన్ని కూడా తమ లాభాలార్జనకే కార్పొరేట్ సంస్థలు వినియోగించుకోవడం దేనిని సూచిస్తోంది? తమకు ఎటువంటి కనీసమైన మానవత్వం కూడా ఉండదనే విషయాన్ని ఈ సందర్భంలోనే ప్రధాని ముద్దుబిడ్డలైన అంబానీ, అదానీ సంస్థలు చాటిచెప్పాయి. దేశ ప్రజల కష్టార్జితంతో కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తిన కార్పొరేట్ దిగ్గజమైన అంబానీ ప్రజలకు వీసమెత్తు సహాయం కూడా చేయకపోగా, కరోనా కాలంలో కూడా తమ సంస్థ అత్యంత లాభాలు గడించిందని సిగ్గులేకుండా ప్రకటించడం, దేశం పట్ల వీరికి ఏమాత్రం బాధ్యత లేదనడానికి నిదర్శనం. ఇంకా సిగ్గుపడాల్సిన విషయమేమిటంటే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరితోనే కునుకడం. దేశం ఏమైపోయినా, దేశ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా తాను మాత్రం ఈ కార్పొరేట్ సేవలోనే తరిస్తూ ఉండడం.
మోడీ గారి స్వంత నియోజకవర్గమైన వారణాసి లోని ఎపెక్స్, మేక్స్వెల్, హెరిటేజ్ వంటి కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా రోగులను చేర్చుకోవడానికి, కనీసం టెస్టులు చేయడానికి కూడా నిరాకరించాయని నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏప్రిల్ 17వ తేదీన వార్త ప్రచురించింది. కార్పొరేట్ సంస్థలు ఎలా ఉంటాయో అనడానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. అదే సందర్భంలో నేడు ప్రజల ప్రాణాలకు రక్షగా నిలుస్తున్నది ప్రభుత్వ ఆసుపత్రులే అన్నది కూడా ప్రజలు నిస్సందేహంగా గమనించారు. సంక్షోభాల కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నవి ప్రభుత్వ రంగ సంస్థలే. కార్పొరేట్ రంగ నిర్వాకం గమనించే నేడు ప్రపంచంలోని అనేక దేశాలు ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని ప్రవేటు సంస్థలను సైతం జాతీయం చేస్తున్నాయి. అయితే అదేం విచిత్రమో కానీ మోడీ ప్రభుత్వం మాత్రం కనీస విచక్షణ కూడా చూపడంలేదు.
దేశ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టైనా కార్పొరేట్ సేవలోనే మునిగి తేలడమా? లేక అసలైన దేశభక్తులుగా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడమా అన్నది మోడీ ప్రభుత్వం తేల్చుకోవాలి. దేశభక్తులుగా నిలవదలచుకుంటే ప్రవేటీకరణ విధానాలు విడనాడడమే నేడు ఏకైక మార్గం. దీనికి భిన్నంగా, దేశ ప్రజలకు ఊపిరి పోస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్ముకుంటూ పోతాను, కష్టకాలంలో ప్రజలకు ప్రాణవాయువు అందిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాణాలు తీసేస్తాను అంటే మాత్రం అది పచ్చి దేశద్రోహం తప్ప మరొకటి కాదు.
దేశ ప్రజలు కూడా తేల్చుకోవాల్సిన రెండు విషయాలున్నాయి. ఈ కార్పొరేట్ భక్తులను సహించడమా? లేక వీరికి చరమగీతం పాడడమా? దేశభక్తి, ఆత్మ నిర్భర్ వంటి ఆకర్షణీయ నినాదాలకు మోసపోవడమా? లేక దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న ఆచరణను చూడడమా?
''వట్టి మాటలు కట్టిపెట్టోరు- గట్టి మేల్ తలపెట్టవోరు, దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోరు-పూని ఏదైనాను ఒక మేల్ కూరి జనులకు చూపవోరు'' అన్న గురజాడ దేశభక్తి గేయం లోని మాటలు నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరుకు అక్షర సత్యాలుగా నిలుస్తాయి. ప్రభుత్వ కపటత్వాన్ని ఎండగట్టేలా ప్రజలు చైతన్యం ప్రర్శించడమే నేడు అత్యవసరం.
/ వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
ప్రధాన కార్యదర్శి /
ఎ. అజ శర్మ











