- తల్లిదండ్రులకు ఆవేదన మిగుల్చుతున్న యువత
- మద్యం మత్తులో ఈతకు దిగి మృత్యువాత పడుతున్న వైనం
- నిరంతర పోలీసు భద్రతే ప్రాణాలకు రక్షణ
ప్రజాశక్తి - బాపట్ల
సముద్ర స్నానాల ఈత సరదాతో యువత పట్టుతప్పి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తీరంలో నిరంతరం పోలీసు భద్రతే ప్రాణాలకు రక్షగా నిలుస్తోంది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఈత సరదా ఆందోళన కలిగిస్తోంది. క్షణాల్లో జరిగే సంఘటనలతో అనేక కుటుంబాలను కలవరపెడుతున్నాయి. యువకుల ఈత సరదా తల్లిదండ్రులకు గుండెజారుతొంది. జీవితమే గల్లంతవుతోంది. ఈత సరదా బాధితులకు ఇప్పుడు భద్రత వ్యవస్థ ముందడుగు వేస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి పునర్జన్మను ప్రసాదిస్తోంది. దీనిపై ప్రజాశక్తి సంక్షిప్త కథనం.
ఇటీవల యువత ఈత సరదాలు ప్రాణాపాయ స్థితికి దారి తీస్తున్నాయి. ప్రతి ఏటా ఈత సరదాల వల్ల సుమారు 2వేల మంది వరకు మృత్యువాత పడుతున్నారని అధికార గణాంకాలు చెప్తున్నాయి. నదులు, కాలువలు, పర్యాటక కేంద్రాలు, సూర్యలంక వంటి సుప్రసిద్ధ సముద్ర తీర ప్రాంతాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది ఈత సరదాతో మృత్యువాత పడుతున్నారు. మరి కొంతమంది మృత్యువు అంచు కెళ్ళి ప్రాణాలతో బయటపడుతున్నారు. తీర ప్రాంతాల్లో పహారా కాసే పోలీసులు, గజ ఈతగాళ్లు సాహసం చేసి సముద్రంలో కొట్టుకెళ్లే వారిని రక్షిస్తున్నారు. ఒక్క బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలోనే ఇటీవల కాలంలో వందలాది మందిని కాపాడారు. కొన ఊపిరితో ఉన్న అనేక మందిని తీరానికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. వృద్ధులు, మహిళలను సైతం ఇక్కడి గజ ఈతగాళ్లు ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. ఇందులో 90శాతంపైగా యువకులే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. సముద్ర స్నానమాచరించే పరిధి దాటి కేరింతలు కొడుతూ సముద్రపు అలల్లో చిందులేస్తూ కొట్టుకెళ్లేవారు కొందరైతే, మద్యం మత్తులో మరికొందరు సముద్రంలో కొట్టుకెళుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒకరిని కాపాడుబోయి మరొకరు, వారిని కాపాడబోయి మరో ఇద్దరు ఇలా వరుసగా మృత్యువాత పడిన సంఘటనలు బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో అనేకం ఉన్నాయి. తాజాగా పోలీసులు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలతో ఇప్పుడు అనేక మంది పర్యాటకులు కొన ఊపిరితో బయటపడ గలుగుతున్నారు.
సముద్రంలో గల్లంతయ్యే వారిని కనిపెట్టి పోలీసులు, గజ ఈతగాళ్లు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కొట్టుకెళ్లే కదలికలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవుతున్నారు. లైఫ్ జాకెట్లతో శరవేగంగా దూసుకెళ్లి రక్షిస్తున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఇక్కడ నిరంతరం పర్యవేక్షణ కోసం పోలీస్ వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండేలా గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులను సిద్ధం చేశారు. దీని ఫలితంగా మూడు నెలల కాల వ్యవధిలో సముద్ర అలల్లో కొట్టుకు వెళ్తున్న 150 మంది పర్యాటకులను కాపాడగలిగారు. రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులతో నిత్యం కిటకిటలాడే సూర్యలంక సముద్ర తీరంలో పర్యాటకులపై నిఘా భద్రత పూర్తిస్థాయిలో అమలు జరుగుతోంది. గతంలో సముద్ర తీరంలో పరిధి దాటి స్నానమాచరించే పర్యాటకులు పొరపాటున కొట్టుకెళ్తే అంతే సంగతులు. ఇప్పుడు నిఘా వ్యవస్థ, అడుగడుగునా గజ ఈతగాళ్ల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా ప్రమాదాలు తగ్గాయి. మెరైన్ పోలీసులు నాయుడు శ్రీనివాసరావు, నాగరాజులు పర్యాటకులను కాపాడటంలో సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారు. గజ ఈతగాళ్లు ప్రాణాలకు తెగించి పర్యాటకులను కాపాడుతున్నారు. వారి కృషిని గుర్తించి పోలీసులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అవతలి వాళ్ళ ప్రాణాలను కాపాడటమే పోలీసుల లక్ష్యంగా పనిచేస్తూ ప్రాణదాతలుగా ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రతి సందర్భంలో ఎస్పీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసలు అందుకుంటున్నారు. మద్యం సేవించిన యువకులే అధిక శాతం సముద్ర స్నానాలకు దిగి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. సముద్ర స్నానానికి విచ్చేసే యువకులు మద్యం సేవించడాన్ని అరికట్టే వ్యవస్థను పోలీసులు కనిపెట్టాల్సిన అవసరం ఉంది.
నిమజ్జన సమయాల్లో జాగ్రత్తలు అవసరం
గణేశ నిమజ్జనాలు గురువారం నుండి ఆరంభమయ్యాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చేందుకు బాజా, భజంత్రీలతో పర్యాటకులు నదీ, సముద్ర జలాల్లో నిమజ్జనం చేస్తున్నారు. యువకులు అత్యుత్సాహంగా గణేశ నిమజ్జన సమయంలో అప్రమత్తంగా లేకపోతే పరిస్థితులు చేజారుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిమజ్జనాల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ యువత బాధ్యతగా వ్యవహరించి ప్రమాదాల నివారణకు నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. తాజాగా సూర్యలంక తీరంలో గణేశ విగ్రహం నిమజ్జనానికి విచ్చేసిన నలుగురు మహిళలు సముద్రపు అలల్లో కొట్టుకుపోవడ్డాన్ని గమనించిన పోలీసులు కాపాడగలిగారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు సముద్ర స్నానాలు, నిమజ్జన సమయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.










