May 16,2023 22:37

ప్రజాశక్తి - కైకలూరు
            దోమల నివారణతో అనేక వ్యాధులను నివారించవచ్చని ట్రెయినీ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ తెలిపారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎంపిపి అడివి వెంకటకృష్ణ మోహన్‌ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ఎంపిపి కృష్ణమోహన్‌ మాట్లాడారు. ప్రజలు ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వైద్యులు హేమలత, శంకర్‌ మాట్లాడుతూ నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కోరారు. ఆసుపత్రి నుంచి ర్యాలీగా వెళ్లి మసీదు సెంటర్‌లో మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తహశీల్దార్‌ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఆగిరిపల్లి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో దోమల వ్యాప్తిని నివారించటంతో పాటు డెంగీ వ్యాధిని నిర్మూలించవచ్చని ఆగిరిపల్లి ఎంపిడిఒ కె.వాణి అన్నారు. ఆగిరిపల్లి పిహెచ్‌సి ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎం.ఉదయ భాస్కరరావు, వైద్యాధికారి జె.జగన్మోహనరావు, సిహెచ్‌ఒ లక్ష్మయ్య, పంచాయితీ కార్యదర్శి ప్రసాద్‌ పాల్గొన్నారు.
టి.నరసాపురం :పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని మండల వైద్యాధికారి ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ అత్యంత ప్రమాదకరమైందని తెలిపారు. డెంగీ వ్యాధి నివారణకు నివాసిత ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. దోమలు ఉధృతంగా ఉంటే దోమ తెరలు వాడాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్‌టి.స్వామి, మెడికల్‌ ఆఫీసర్లు, హెల్త్‌ సూపర్‌ వైజర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
చింతలపూడి : సమర్థవంతమైన సమాజ భాగస్వామ్యంతో డెంగీ వ్యాధిని నివారించగలమని చింతలపూడి మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి నెరుసు వెంకట రామారావు అన్నారు. కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా యర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రామరావు మాట్లాడుతూ ప్రజల్లో డెంగీ వ్యాధి పట్ల అవగాహన పెంపొదించాలన్నారు. డెండీ మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే దోమన నిర్మూలన సాధ్యమన్నారు. నివాసిత ప్రాంతాల్లో దోమల నియంత్రణకు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ యూనిట్‌ అధికారి నెరుసు వెంకట రామారావు, పిహెచ్‌ఎన్‌. రమణమ్మ, హెచ్‌వి పరిమళ కుమారి, ఎంపిహెచ్‌ఎ మేల్‌, ఫీమేల్‌, ఎంఎల్‌హెచ్‌పి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
ముసునూరు : డెంగీ అతి ప్రమాదకరమైన వ్యాధి అని ముసునూరు పిహెచ్‌సి వైద్యులు ఎం.కిరణ్‌కుమార్‌, రమణక్కపేట పిహెచ్‌సి వైద్యులు కరిముల్లా అన్నారు. మండలంలోని ముసునూరు, రమణక్కపేట గ్రామాల్లో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ర్యాలీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వైద్యులు ఎం.కిరణ్‌ మాట్లాడుతూ ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని చెప్పారు.
జీలుగుమిల్లి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో డెంగీ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు వైద్యాధికారిణి డాక్టర్‌ సుష్మ తెలిపారు. ఈ సందర్భంగా డెంగీ వ్యాధి నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమ తెరలను వాడాలని తెలిపారు. అనంతరం జీలుగుమిల్లీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గాయిత్రి, ఫార్మసిస్ట్‌ నాగేశ్వరరావు, వైద్య సిబ్బంది నాగమణి నాగరత్నం, చంద్రకాంత్‌, ఆదిలక్ష్మి, ఎల్‌టి.విజరు పాల్గొన్నారు.
పోలవరం : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలవరం ఎంపిడిఒ సిహెచ్‌.శ్రీనివాస్‌బాబు అన్నారు. మండలంలోని కుంకాల ఏజెన్సీ గ్రామంలో సర్పంచి కోటం గంగాదేవి, విస్తరణాధికారి నిఖిల్‌ మధు శరన్‌, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి బి.నాగేశ్వరరావు ఆరోగ్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ ప్రజాఆరోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులని, దోమల వల్ల మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా, బోధ వ్యాధి, మెదడు వాపు వ్యాధులు వస్తాయని వివరించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. డెంగీ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యశాలకు వెళ్లాలని, అశ్రద్ధ చేయకూడదని చెప్పారు. కుంకాల గ్రామంలో మొదటి విడతగా ప్రతి ఇంటికి దోమల నివారణకు దోమల మందు పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఎన్‌డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపిహెచ్‌ఇఒ జారేం ప్రసాద్‌, మలేరియా కార్యాలయ ఎంపిహెచ్‌ఒ పి.శ్రీనివాసరావు, ఎఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.
నూజివీడు రూరల్‌ : మండలంలోని గొల్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి పి.శ్రీనివాస్‌గౌతమ్‌ మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి పి.అనూష, హెల్త్‌ సూపర్‌వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.