Jul 09,2023 23:59

కొలకలూరు మెయిన్‌ సెంటర్‌లో గోతులు పడిన రోడ్డు

ప్రజాశక్తి-తెనాలి : ఆర్‌అండ్‌బి రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. నడిరోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలను శంకిస్తున్నాయి. ద్విచక్రవాహన చోదకులు, ఆటోలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదు. దీనికి తోడు భారీ వర్షాలతో రోడ్లు మరింత ప్రమాదభరితంగా తయారయ్యాయి. నందివెలుగు- గుంటూరు మార్గంలో ప్రధాన రహదారి దుస్థితి ప్రయాణికులను బయపెడుతోంది.
నందివెలుగు- గుంటూరు మార్గంలో గుంటూరు ఆర్‌అండ్‌బి పరిధిలో గుంటూరు నుంచి వెంకటకృష్ణాపురం వరకూ రోడ్డు బాగానే ఉంది. కాని తెనాలి ఆర్‌అండ్‌బి పరిధిలో జాకీర్‌హుస్సేన్‌ నగర్‌ నుంచి కొలకలూరు వరకూ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. కొల్లిపర, హనుమాన్‌పాలెం, దుగ్గిరాల, నందివెలుగు, తెనాలి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ఇసుక టిప్పర్లు, ఇటుక రాయి లోడు లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, వివిధ విద్యా సంస్థలకు వాహనాలు నిత్యం వేలకొలది ప్రయాణిస్తుంటాయి. ఈ మార్గంలో దీర్ఘకాలికంగా రోడ్డు నిర్మాణానికి గాని, మరమ్మతులగాని నోచుకోలేదు. ఏదైనా ప్యాచ్‌ వర్కులు చేసినా చేశామనే పేరుకేగాని, ఏ మాత్రం ప్రయోజనం లేదు. దీంతో కొన్నిచోట్ల రోడ్డు ఇరువైపులా కుంగిపోతే, మరి కొన్నిచోట్ల నడిరోడ్డుపై గోతులు పడ్డాయి.
తెనాలి ఆర్‌అండ్‌బి పరిధిలోని జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌ నుంచి కొలకలూరు వంతెన వరకూ రోడ్డు పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. హాఫ్‌పేట-ఖాజీపేట గ్రామాల మధ్య రోడ్డు ఇరువైపులా కుంగి పోయింది. ఆటోలు, బస్సుల్లో ప్రయాణీకుల ఒళ్లు హూనం కావాల్సిందే. ఖాజీపేట మెయిన్‌ సెంటర్లో పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. గతంలో ఇదే పరిస్థితి ఎదురైనపుడు అధికారులు స్పందించకపోవటంతో గ్రామస్తులు ఆ గోతుల్లో డస్ట్‌ పోయించారు. వర్షాలకు డస్ట్‌ కొట్టుకుపోయి తిరిగి గోతులమయమైంది. కొలకలూరు పిహెచ్‌సి, కోనేటిపురం సెంటర్‌ మధ్య మెయిన్‌ రోడ్డుపై ఓ కల్వర్టు కుంగి పోయింది. నడిరోడ్డుపై ప్రమాదకరమైన గోతులు ఏర్పడ్డాయి. వాహనాలు ప్రమాదాల భారిన పడకుండా గోతులను గుర్తించేందుకు స్థానికులు ఓ ఇసుక గోతాంలో కర్రని నిలబెట్టారు. గతంలో ఇదే ప్రాంతంలో కొల్లిపర మండలం పిడపర్రుకు చెందిన పెయింట్‌ వర్కర్‌ బైక్‌పై వెళుతూ వాహనం గోతిలో దిగటంతో అదుపుతప్పి పడిపోయాడు. తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు కూడా.
గ్రామ ప్రదాన కూడలిలో పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. వర్షానికి గోతులు మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. సినిమాహాల్‌ సెంటర్‌, పెద్దకాలువ వంతెనపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు ఏడెనిమిది నెలల క్రితం నందివెలుగులో ఓ హౌటల్‌లో పనిచేస్తున్న వ్యక్తి స్కూటర్‌పై వెళుతూ, కొలకలూరు వంతెనపై ఉన్న గోతిలో పడి వాహనం అదుపుతప్పటంతో గాయాలపాలై మృతి చెందాడు. రోడ్లు ఎంత ప్రమాదభరితంగా ఉన్నా ఆర్‌ అండ్‌ బి అధికారులకు మాత్రం చీమకు ట్టినట్టు కూడా ఉండదు. నిత్యం ఇదే మార్గంలో తిరిగే ప్రజాప్రతినిధులు కూడా రోడ్డు మరమ్మతులపై స్పందిం చరు. కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టరు. ఇంకా ఎన్ని ప్రమాదాలు జరగాలో, ఎంత మంది ప్రాణాలు పోతే అధికారులు స్పందిస్తారో? అని ప్రయా ణికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికిగాని, మరమ్మతు లకుగాని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
టెండర్ల దశలో ఉంది
నాగేశ్వరరావు, డిఇ, ఆర్‌అండ్‌బి, తెనాలి

నందివెలుగు-గుంటూరు మార్గంలో ప్రధానంగా రెండు మూడు చోట్ల రోడ్డు బాగా దెబ్బతిన్న మాట వాస్తవమే. అయిదే రోడ్డు ప్యాచ్‌ వర్కులు చేసి, దానిపై ఒక లేయర్‌ వేసేందుకు రూ.3.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి సంబంధించి పనులు టెండరు దశలో ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా టెండర్లు ఫైనల్‌ చేసి, రోడ్డు పనులు చేపడతాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.