Aug 04,2023 22:06

నదిలో తడకపై కుమార్తెను తీసుకెళ్తున్న సోమయ్య, చంద్రమ్మ

ప్రజాశక్తి-కొమరాడ :  మండలంలో నాగావళి నది ఆవల ఉన్న ప్రజలు వర్షాకాలంలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన దుస్థితి ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఏ చిన్న కష్టం వచ్చినా నది దాటి రావాలంటే వారికి అదో పెద్ద గండంగా మారుతుంది. ప్రాణాలను ఫణంగా పెట్టి నాగావళి నది దాటుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే తరహా ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తమ కుమార్తె పసిప్రాణాలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ప్రయత్నం పలువురిని కంటతడి పెట్టించింది.
మండలంలోని చోల్లపదం రెబ్బ గ్రామానికి చెందిన కోలక సోమయ్య, చంద్రమ్మ కుమార్తె మరియమ్మ (7) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. నాగావళి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వైద్య సిబ్బంది వచ్చి సేవలందించే పరిస్థితి లేకపోయింది. దీంతో పరిస్థితి కాస్త విషమించడంతో తన కుమార్తె ప్రాణాలను కాపాడుకునేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నాగావళి నది దాటే ప్రయత్నం చేశారు. స్థానికంగా దొరికే వెదురు కర్రలతో తడకలాగా తయారు చేశారు. దానిపైన తన కుమార్తెను పెట్టుకొని చుట్టుపక్కల వారి సహాయంతో నదిలో మోసుకొని అవతలి ఒడ్డుకు చేరారు. ఒక పసి ప్రాణం కోసం కుటుంబ సభ్యులు ప్రాణాలు ఫణంగా పెట్టి ఒడ్డుకు చేర్చారు. అక్కడ నుంచి కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రాయగడ వెళ్లారు. చికిత్స అనంతరం నాగావళి నదిలో ఇబ్బందులు పడుతూ ఇంటికి చేరారు.
నది దాటు తున్న సమయంలో తమ కష్టాలను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు గిరిజనులు ఒక వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసి 'మా బాధలను, కష్టాలను ఇప్పటికైనా తప్పించండి' అంటూ ఒక సందేహాన్ని పంపారు. గిరిజనులు నదిలో పడిన కష్టాలకు సంబంధించిన వీడియోతో పాటు ఆ సందేశం పలు గ్రూపుల్లో వైరల్‌గా మారింది. గిరిజనులకు ఎంతో అవసరమైన పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో నది దాటేందుకు అటువైపున గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వంతెన పనులు ప్రారంభించి ఏళ్ళు గడుస్తున్నా కనీసం సగానికి పైగా కూడా పనులు జరగనీ పరిస్థితి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం పనులు ముందుకు కదల్లేదు. దీంతో వర్షాకాలంలో ఏ చిన్న కష్టం వచ్చినా నది దాటేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి రావాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఎంతోమంది గిరిజనులకు అవసరమైన పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.