Jul 31,2023 18:28

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విద్యుత్‌ సంస్థల వేతన సవరణ, కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణ, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ స్ట్రగుల్‌ కమిటీ, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. తొలుత ధర్నా చౌక్‌ వద్ద నుండి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన చేశారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌ మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నా ప్రభుత్వం, విద్యుత్‌ యాజమాన్యం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. 2018 పీఆర్సీ గడువు ముగిసి 15 నెలలైనా కొత్త వేతన ఒప్పందాలకు యాజమాన్యం సిద్ధపడడం లేదన్నారు. తెలంగాణలో విద్యుత్‌ ఉద్యోగుల కంటే ఆంధ్రప్రదేశ్‌లో 30 శాతం వరకు తక్కువగా వేతనాలున్నాయని తెలిపారు. తెలంగాణలో కాంట్రాక్ట్‌ స్కిల్‌ కార్మికులకు నెలకు రూ.43,162 ఇస్తుంటే ఇక్కడ మాత్రం రూ.20,598 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తూ.. తాము అధికారంలోకి రాగానే అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని, కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జెఎల్‌ఎం గ్రేడ్‌-2లు ప్రాణాలు పణంగా పెట్టి పని చేశారని, మరణించిన వారి స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని, వీరి కుటుంబానికి వైద్య సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఉద్యోగులు, కార్మికుల జీతాల కోసమే ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని, ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే 10 తర్వాత మెరుపు సమ్మెకు ఉద్యోగులు, కార్మికుల సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనంతరం జెసి శ్యాంప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసరావు, అధ్యక్షులు జె.రాజశేఖర్‌, విద్యుత్‌ పర్మినెంట్‌ ఉద్యోగ సంఘ నాయకులు ఎం.సుబ్బారెడ్డి, ఇతర నాయకులు బాలకృష్ణ, కె.శ్రీను, రాజశేఖర్‌, మురళి, కరీముల్లా, గిరి, బాష, రాజేష్‌, శివ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ధర్నాకు శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, సిఐటియు పట్టణ అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు యు.రంగయ్య, సంఘీభావం తెలిపారు.