Jun 30,2023 22:56

ప్రజాశక్తి - మాచర్ల : మాచర్ల పట్టణానికి చెందిన టిడిపి నాయకులు సయ్యద్‌ ఆన్వర్‌బాషాను బుధవారం రాత్రి పోలీసులు హత్యాయత్నం కేసులో ఆరెస్టు చేసిన అంశం తెలిసిందే. ఆన్వర్‌పై ఆక్రమ కేసు బనాయించారని, ఆరెస్టు ఆన్యాయం అంటు శుక్రవారం ఆన్వర్‌బాషా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి, కార్యక్రమంలో నాయకులు కుర్రి శివారెడ్డి, కొమెర దుర్గారావు ఇతర నాయకులు శుక్రవారం ఆన్వర్‌ ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మసీద్‌ ఎదురుగా ఉన్న జెండా చెట్టు వద్ద మీడియాతో మాట్లాడేందుకు బ్రహ్మరెడ్డి బయలుదేరగా జెండా చెట్టు వద్దకు కొందరు వైసిపి నాయకులు వచ్చి ప్రెస్‌మీట్‌కు అంభ్యంతరం తెలిపారు. మరోవైపు బ్రహ్మారెడ్డిని పోలీసులు అడ్డుకుని ఆన్వర్‌బాషా ఇంటి వద్దే మీడియాతో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే ఆన్వర్‌బాషా ఇంటి ప్రక్కన గల మరో బజారులో మరో వ్యక్తిని పరామర్శించేందుకు వచ్చిన బ్రహ్మరెడ్డిని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. దీంతో బ్రహ్మరెడ్డి, టిడిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి గంటపాటు ధర్నా చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై విమర్శలు గుప్పించారు. ధర్నా అనంతరం జెండా చెట్టు సమీపంలోని వారి వాహనాల దగ్గరకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో బ్రహ్మారెడ్డి వాగ్వాదానికి దిగారు. సిఐ సమీముల్లా జోక్యం చేసుకుని రామాటాకీసు బజారు నుండి సెంటర్‌కు వెళ్లాలని సర్దిచెప్పారు.
బాధిత కుటుంబంతో మాట్లాడిన చంద్రబాబు
ఆక్రమ కేసులో ఆన్యాయంగా ఆరెస్టయిన టిడిపి నాయకులు సయ్యద్‌ ఆన్వర్‌బాషాకు న్యాయ సహయం అందించి త్వరలోనే బయటకు తెస్తానని టిడిపి అధినేత చంద్రబాబునాయడు అన్నారు. ఓ కేసులో రిమాండ్‌కు వెళ్లిన ఆన్వర్‌బాషా కుటుంబాన్ని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి పలువురు టిడిపి నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంలో బాషా కుటుంబీకులతో ఫోన్‌ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అందుబాటులో బ్రహ్మరెడ్డి, ఇతర నాయకులు ఉంటారని ధైర్యం చెప్పారు. ఆరాచకాలు ఎంతో కాలం సాగవని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని అన్నారు.