Mar 27,2023 20:37

దీక్షలు ప్రారంభిస్తున్న రాష్ట్ర నాయకులు రామాంజనేయులు

ప్రాజెక్టులు చేపట్టాలని సిపిఐ నిరసన దీక్ష
ప్రజాశక్తి - నంద్యాల

       పోలవరం ప్రాజెక్టను ఎత్తు తగ్గించకుండా నిర్మించాలని, నిర్వాసితులకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం నంద్యాల కలెక్టరేట్‌ ముందు నిరసన దీక్ష చేపట్టారు. రెండు రోజులపాటు చేపట్టే దీక్షకు మొదటిరోజు సిపిఐ పట్టణ కార్యదర్శి కె.ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. దీక్షనుద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం 41.15 మీటర్లు ఎత్తు వరకే అంటూ కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహల్లాద సింగ్‌ పటేల్‌ పార్లమెంటులో చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సిఎం అర్ధాంతరంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారని, అక్కడేమో పోలవరం ప్రాజెక్టు కేటాయించాలని పేపర్‌ ప్రకటన ఇస్తూ, అంతర్గతంగా పులివెందులలో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు నుండి బయటపడేందుకు అవినాష్‌ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నం తప్ప నిజాయితీగా 32 మంది ఎంపీలు ఉన్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా ఎందుకు ప్రశ్నించలేక పోతుందని ప్రశ్నించారు. మొదటిరోజు దీక్షకు టిడిపి తరఫున ఖలీల్‌ ఆధ్వర్యంలో మద్దతు తెలియజేశారు. ఈ దీక్షలో సిపిఐ, అనుబంధ ప్రజా సంఘాల నాయకులు కూర్చున్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.రాధాకృష్ణ, ఆళ్లగడ్డ కార్యదర్శి భాస్కర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, జిల్లా సమితి సభ్యులు చెన్నయ్య పాల్గొన్నారు.