ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు
- ఆరు తడి పంటలకే నీరు
- ఈ ఏడాది వరి సాగు ప్రశ్నార్థకమే..
- ఉమ్మడి జిల్లాల్లో వర్షభావ పరిస్థితులు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువన వర్షాలు అంతంతమాత్రమే కురవడంతో ప్రాజెక్టుల్లో నీటి చేరికలు ఆశాజనకంగా లేవు. ఉన్న నీటి నిల్వలను సైతం ఆయకట్టు పంటలకు విడుదల చేస్తుండడంతో నిల్వలు తగుతున్నాయి. అయితే ఆరు తడి పంటలకు కూడా పూర్తి స్థాయిలో సాగు నీరు ఇచ్చే పరిస్థితులు కనపడడం లేదు. ఎగువన వర్షాలు పడకపోవడం, జిల్లాలో అంతంత మాత్రమే వర్షపాతం నమోదు కావడంతో కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయనే భయందోళనలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాజెక్టులలో నీటి నిల్వలు ఈ విధంగా ఉన్నాయి. తుంగభద్ర ప్రాజెక్ట్‌లో 105 టిఎంసిలు సామర్థ్యం కాగా ప్రస్తుతం 83.4 టిఎంసిలు నిల్వ ఉంది. ఇన్ ప్లో 1085 క్యూసెక్యులు కాగా అవుట్ ప్లో 10,325 క్యూసెక్యులు హెచ్‌ఏల్‌సి, ఎల్‌ఎల్‌సికి వదిలారు. అలాగే సుంకేసుల బ్యారేజ్ నీటి సామర్థ్యం 1.2 టిఎంసి కాగా ప్రస్తుతం 0.84 టిఎంసిలు ఉన్నాయి. ఉన్న నీటిని కేవలం కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు. గత నెలలో ఎగువన కురిసిన వర్షాల వలన శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి దాదాపు 101.6 టిఎంసిల నీరు వచ్చి చేరింది. ఉన్న నీటి నిల్వలో 49 వేల క్యూసెక్యుల నీటిని కిందకు వదులుతున్నారు. అందులో నంద్యాల జిల్లా ఆయకట్టు పంటలకు సాగు అవసరాల కోసమని నీటిని పోతిరెడ్డి పాడుకు 8 వేల క్యూసెక్యులు నీటిని వదిలి దాని ద్వారా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 1,350 క్యూసెక్యులు, కెసికి 100 క్యూసెక్యుల వదిలారు. మరో 800 క్యూసెక్యుల నీటిని కల్వకుర్తి ఎత్తిపోతలకు, తెలంగాణ పవర్ ఉత్పత్తికి 31.780 క్యూసెక్యుల నీటిని వాడుకుంటున్నారు. అలాగే వెలుగోడు రిజర్వాయర్‌లో 16.9 టిఎంసిల నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం 7.1 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నాయి. దీనిలో 2190 క్యూసెక్యుల నీటిని తెలుగు గంగ ఆయకట్టుకు వాడుకోవడానికి అధికారులు వదిలారు. నేటి వరకు తెలుగుగంగకు 4 వేల క్యూసెక్కులు ఇన్‌ప్లో వస్తుండగా అవుట్ ప్లో కింద 2190 క్యూసెక్యుల నీరు ఆయకట్టుకు వదిలారు. గోరుకల్లు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 12.5 టిఎంసిలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 4.7 టిఎంసిలు ఉంది. ఈ రిజర్వాయర్‌కు 4 వేలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా ఈ నీటిని ఎస్‌ఆర్‌బిసి కాల్వ ద్వారా ఆయకట్టుకు 131 క్యూసెక్కుల నీటిని వదిలారు. అలాగే అవుకు రిజర్వాయర్ నీటి సామర్థ్యం 4.1 టిఎంసిలు కాగా ప్రస్తుతం 1.2 టిఎంసిల నీటి నిల్వ ఉంది. అందులో 165 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు వదిలారు. జిల్లాలోని ప్రాజెక్ట్‌లలో ప్రస్తుతం నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోకపోతే సాగు, తాగు నీటికి కష్టమేనని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎగువన వర్షాలు అంతంత మాత్రమే పడ్డాయని, తుంగభద్రలో పూర్తి స్థాయి నీటి నిల్వలు లేకపోవడంతో జిల్లాలో వరి సాగు కష్టంగానే ఉంటుంది. ఈ ఖరీఫ్‌లో ఈ పాటికి నీటిపారుదల కింద 80 శాతం పైన వరి సాగు జరిగేది. ప్రస్తుతం నామ మాత్రంగానే సాగయింది. వరి సాగు చేస్తే రైతన్న తీవ్రంగా నష్టపోయో ప్రమాదం ఉందనే హెచ్చరికలు వ్యవసాయ శాస్త్రవేత్తల నుండి వినిపిస్తున్నాయి. ఆరుతడి పంటలకే రైతులు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లలో ఉన్న నీటి వనరులు కేవలం 10 రోజులకు ఒక్కసారి వదిలినా 70 రోజులు పై బడి వచ్చే పరిస్థితి కనబడటం లేదనే అభిప్రాయాన్ని నీటిపారుదల అధికారులు వ్యక్తం చేస్తున్నారు.










