Aug 08,2023 22:33

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

* వంశధార ప్రాజెక్టును చంద్రబాబు కొనసాగించారంతే
* తన ఖాతాలో వేసుకునే హక్కు లేదు
* రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
ప్రాజెక్టుల సందర్శన పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశధార ఫేజ్‌-2 స్టేజ్‌-2కు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రూపకల్పన చేస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నింపడానికి హిరమండలం వద్ద ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించారని చెప్పారు. వంశధార పనులను చంద్రబాబు కొనసాగించారే తప్ప దాన్ని తన ఖాతాలో వేసుకునే హక్కు లేదన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి జిఒ ఇచ్చి భూసేకరణ కూడా చేయలేదని విమర్శించారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ కూడా వైఎస్‌ హయంలో వచ్చిందేనని, చంద్రబాబు దాన్నీ పూర్తి చేయలేకపోయారని చెప్పారు. నేరడి బ్యారేజీపై ఒడిశాతో వివాదాలున్న నేపథ్యంలో సైడ్‌వియర్‌ కాలువ ఆలోచన చేసింది వైఎస్‌ అని తెలిపారు. చంద్రబాబుకు ఎందుకు ఇటువంటి ప్రత్యామ్నాయాలు అమలు చేయలేదని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు అన్యాయం జరిగితే, వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి అదనపు పరిహారం ఇచ్చామన్నారు. మూలపేట పోర్టు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ శంకుస్థాపనను నిర్వాసితులు బహిష్కరించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విశాఖ, గంగవరం పోర్టుల నిర్మాణం కోసం భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యలు ఏళ్ల తరబడి సాగాయని చెప్పారు. మూలపేటలో మాత్రం ఏడాదిలోనే భూసేకరణ, చెల్లింపులు పూర్తయ్యానని, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాలని చూశారని చెప్పారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చంద్రబాబు కుట్రతో ప్రాణ నష్టం కాకుండా చేసినందుకు వారికి సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు తన ప్రచారం పిచ్చి కోసం రాజమండ్రి పుష్కరాల్లో ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో హింసను ప్రేరేపించి, ఆ సానుభూతితో గెలవాలని చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనించాలని, ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. తన రెడ్‌ డైరీలో చిత్తూరు ఎస్‌పి రిషాంత్‌ రెడ్డి నంబరు వన్‌గా నారా లోకేష్‌ చెప్పడంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఐపిఎస్‌కు, దొడ్డిదారిలో మంత్రి పదవిని పొందిన లోకేష్‌కు పోలికేంటని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే కాగలడా, అసలు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తాడో చెప్తే తాము రాజకీయాలు వదిలి వెళ్లిపోతామని సవాల్‌ విసిరారు. సమావేశంలో కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, వైసిపి నాయకులు శిమ్మ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.