Jun 04,2021 06:55

రెండవ విడత కరోనా కేసులు రాష్ట్రంలో ఇంకా తగ్గకమునుపే త్వరలో మూడవ విడత రానుందనీ, అది చిన్నారులను ఇబ్బందుల పాల్జేస్తుందన్న వార్తలు అందరినీ భయకంపితులను చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన దృష్టిని కోవిడ్‌ కట్టడిపై కేంద్రీకరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనాకు తోడు రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. చికిత్సకు అవసరమైన మందుల్ని కేంద్రం ఇవ్వడంలేదు. రాష్ట్రంలో తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో వాటి సరఫరాకు, చికిత్సకూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో రెండవ విడత కరోనా బాధితుల్లో 20 ఏళ్ల కంటె తక్కువ వయసువారు పది శాతానికి పైగా ఉన్నారన్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జులై, ఆగస్టు నెలలో విరుచుకుపడే మూడవ విడత కరోనా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ ఐసిఎంఆర్‌ తో పాటు పలువురు నిపుణులు చేసిన హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాయి. వైద్యులు, శాస్త్రజ్ఞులతో బృందాలను నియమించాయి. ముంచుకొస్తున్న మూడవ విడత ముప్పు, చిన్నారులకు సంభవించే ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించిన దాఖలాల్లేవు. ఆ పని మానేసి కరోనాను నయం చేయని ఆనందయ్య మందు గురించి కొందరు అధికారులు ఎక్కడా లేని ఉత్సాహం చూపించడమెందుకో! నాటుమందుతో ప్రతికూల ఫలితాలు బయటపడితే ప్రజలకు జవాబు చెప్పుకోవలసింది ప్రభుత్వమే తప్ప ఆనందయ్య కాదన్న ఆలోచన కూడా లేదా?
మూడో విడత ముప్పు చిన్నారులకు ఎక్కువని హెచ్చరికలు వస్తున్నా ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పెను మార్పులను ప్రతిపాదించడం ప్రభుత్వం ప్రాధాన్యతలు సక్రమంగా లేవని సూచిస్తోంది. కోవిడ్‌ కాలంలో అందరూ బలవర్ధక ఆహారం తినాలని వైద్యులు చెబుతుంటే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ఈ సమయంలో అస్తవ్యస్థం చేస్తారా? ఇలాంటి గందరగోళాలు ఇప్పుడవసరమా? ప్రజలు ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన ఈ రోజుల్లో నగరాలు, పట్టణాల్లో చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడం మరో ఉదాహరణ. ప్రజలపై భారాలు మోపవలసిన సమయమా ఇది? కరోనాతో పోరాడాల్సిన జనాన్ని పన్ను భారాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రేరేపించినట్టు అవ్వడం లేదా? సరిగ్గా ఈ సమయంలోనే పాలనా రాజధాని గురించి మంత్రులు, ఎం.పి లు మళ్లీ చర్చ లేవనెత్తడం ఏ విధంగా సబబు? కరోనా కట్టడికి తగు చర్యలు చేపట్టకుండా వేల కోట్ల ఖర్చుతో మోడీ సర్కారు సెంట్రల్‌ విస్తా నిర్మాణం మీద దృష్టి సారించడం అనుచితమని దేశమంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల బాధలు పట్టనట్లు ఈ సమయంలో రాజధాని తరలింపు సమస్యను ముందుకు తెస్తోంది.
ప్రజల ప్రాణాలు రక్షించడం, జీవనోపాధిని పరిరక్షించడం ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్‌ విపత్తును కట్టడి చేయడంపై కేంద్రీకరించాలేతప్ప రాష్ట్ర ప్రభుత్వ దృష్టి అటు ఇటు మళ్లరాదు. అనేక అంశాల్లో కోవిడ్‌ ఒకటి అన్న దృక్పథాన్ని వెంటనే విడనాడాలి. కరోనాను ఎదుర్కోవడం మాత్రమే ఇప్పుడు ప్రాధాన్యతగా వుండాలి. సార్వత్రిక ఉచిత వ్యాక్సిన్‌ అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతంటూ మోడీ సర్కారును నిలదీయాలని అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మన సి.ఎం ప్రతిపాదించడం అభినందనీయం. కేంద్రంపై సమిష్టి ఒత్తిడితో రాష్ట్రానికి కావలసిన వ్యాక్సిన్‌, మందులను సాధించాలి. ఈ కృషిలో రాష్ట్ర ప్రజలను, రాజకీయ పార్టీలనూ భాగస్వాములను చేయాలి. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ అంతా ఐక్యంగా ప్రతిఘటించి కోవిడ్‌ను తరిమి కొడుతుందన్న వాతావరణాన్ని సృష్టించాలి. వివాదాస్పద విషయాల జోలికి పోకుండా తన సకల శక్తులనూ కోవిడ్‌ కట్టడిపై కేంద్రీకరించడం రాష్ట్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.