
రాయచోటి : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాధా న్యత భవన నిర్మాణాలను త్వరతగతన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు, రీ-సర్వే, ఎంపిఎఫ్ సి గోడౌన్, హౌసింగ్ తదితర అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అధికారులు అందరూ ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో నిర్లక్ష్యం చూప కుండా భవన నిర్మాణాలు అత్యంత ప్రమాణాలతో రూపుదిద్దు కొనేటట్లు చూడాలన్నారు. అన్ని జిల్లాలలో భవన నిర్మాణాలకు సంబంధించి రోజు రోజుకూ పురోగతి కనిపించేలా ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాలన్నారు. జరిగిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడూ బిల్లులు పెండింగ్ లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. సర్వే కార్యక్రమాన్ని పక్కాగా, పకడ్బందీగా చేపట్టాలన్నారు. జిల్లాలోని సర్వే సిబ్బంది తహశీల్దార్లతో సమన్వయం చేసుకొని నిర్దేశించిన కాల పరిమితిలోగా సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలలో వేగం పెంచాలని, గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణంలో స్పష్టమైన పురోగతి కనిపించాలన్నారు. బిల్లులను పెండింగ్ లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. జిల్లాలోని సర్వే అధికారులు, సిబ్బంది సర్వేయర్లు సమన్వయంతో పనిచేసి రీ-సర్వే కార్యక్రమాన్ని త్వరితగతన పూర్తి చేయాలన్నారు.