ప్రాధాన్యత భవనాలను పూర్తి చేయాలి
ప్రగతి లక్ష్యంలో నిర్లక్ష్యం వహించే ఇంజినీర్ల వార్షిక రహస్య నివేదికలో రిమార్కులు పొందుపరుస్తాం
జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్
ప్రజాశక్తి - నంద్యాల, కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ప్రాధాన్యత భవనాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో నిరంతర కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రాధాన్యత భవనాల ప్రగతిపై పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు తదితర ప్రాధాన్యత భవనాల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణాల పురోగతిపై ప్రతివారం చీఫ్ సెక్రటరీ సమీక్షిస్తూ పురోగతిని తెలుసుకుంటున్న నేపథ్యంలో లక్ష్య ప్రగతిపై పూర్తిస్థాయి దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.కొంతమంది ఇంజనీరింగ్ అధికారులు నిర్లిప్తతతో మొక్కుబడి రీతిలో విధులు నిర్వహించడం వల్లే ప్రగతి కుంటు పడుతోందని.... ఇదే రీతిలో కొనసాగితే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఇంజినీర్ కు తక్కువ స్థాయిలో బిల్డింగులు ఉన్నప్పటికీ పురోగతి చూపడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. ప్రగతి చూపిన ఇంజనీరింగ్ అధికారులకు గ్రేడింగ్ ఇవ్వడంతో పాటు లక్ష్య ప్రగతిలో నిర్లక్ష్యం వహించి ప్రగతి చూపించని అధికారుల వార్షిక రహస్య నివేదికలో రిమార్కులు పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ప్రతి ఇంజనీరింగ్ అధికారికి నిర్మాణపు బిల్డింగ్లు తక్కువగా ఉన్నాయని లక్ష్యాన్ని చేధించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నిర్మాణాలు చేపట్టేందుకు మెటీరియల్ కొరత ఉందని.... లేబర్ రావడం లేదని కారణాలు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. పురోగతి చూపని అధికారులను సరెండర్ చేసేందుకు కూడా వెనుకాడమన్నారు.మండలాల వారీగా సమీక్షిస్తూ కేటాయించిన భవనాలు ఎన్ని పూర్తి చేశారు, ఇంకనూ పూర్తి చేయాల్సినవి ఎన్ని, నిర్మాణ ఏజెన్సీలు నాణ్యతగా పనులు పూర్తి చేస్తున్నారా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా తదితర అంశాలలో ఇంజనీరింగ్ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు 415 పూర్తి పూర్తి చేయాల్సి ఉండగా 166 పూర్తి చేశారని, అలాగే ఆర్బికేలు 394 కు 127 పూర్తి కావడం జరిగిందని, విలేజ్ హెల్త్ క్లినిక్స్ 272 కి 114 భవనాలు పూర్తి చేశారని మిగిలిన దశలో ఉన్న నిర్మాణాలను సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాధాన్యత భవనాలకు సంబంధించి నిధుల కొరత లేదన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా నంద్యాల జిల్లాలో డిఎంఎఫ్ నిధుల నుండి రెండు కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేశామన్నారు. భవనాల నాణ్యతలో ఎక్కడ రాజీపడరాదన్నారు. నిర్మాణ ఏజెన్సీ నాణ్యతగా పనులు పూర్తిచేసేలా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తగు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే ఉన్నత స్థాయి దృష్టికి తీసుకురావాలన్నారు.ఏరోజు కారోజు ప్రాధాన్యత భవనాల ప్రగతిని మానిటరింగ్ చేస్తూ లక్ష్యం మేరకు భవనాలు పూర్తి చేయడంలో బాధ్యతగా కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీరాజ్ ఎస్ఇ రామ్మోహన్, ఈఈ రామకృష్ణ, డిఈలు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.










