Aug 23,2023 20:42

ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న డాక్టర్‌ వేణుగోపాల్‌, ఎంపిడిఒ కొండయ్య

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రభుత్వ భవన నిర్మాణాలు, ప్రభుత్వం నిర్దేశించిన జగనన్న కాలనీలోని హౌసింగ్‌ నిర్మాణాలు త్వరగా వంద శాతం పూర్తి కావాలని ఎస్‌ఎస్‌ఎ ఎపిసి, మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ వేణుగోపాల్‌ మండల అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కార్యాలయంలో ఎంపిడిఒ సివి.కొండయ్య ఆధ్వర్యంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం చిప్పగిరి జగనన్న కాలనీలోని హౌసింగ్‌ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీలోని ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు దారులను ఆదేశించారు. మెటీరియల్స్‌, హౌసింగ్‌ బిల్లులను ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. మండలంలో సచివాలయ, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను చివరి దశకు వచ్చాయని తెలిపారు. సెప్టెంబర్‌ ఆఖరి నాటికి వంద శాతం పూర్తి కావాలన్నారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు అభివృద్ధి పనులపై సంబంధిత ఎంఇఒలు సావిత్రమ్మ, బాల నాయుడును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూరిబా పాఠశాలలో 'చంద్రయాన్‌-3'పై నిర్వహించిన కార్యక్రమాన్ని బాలికలతో కలిసి తిలకించారు. ఇఒఆర్‌డి సంజన, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ రామ్‌ నీలా, పంచాయతీ కార్యదర్శి నాగభూషణం, హౌసింగ్‌ అధికారి భవ్య, కెజిబివి సిబ్బంది పాల్గొన్నారు.