Sep 19,2023 22:07

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ తో పాటు డిఆర్‌ఒ కొండయ్య పాల్గొన్న సమావేశంలో వ్యవసాయ శాఖ, జగనన్నకు చెబుదాం, ఆరోగ్య సురక్ష, స్పందన, నాడు నేడు, జగనన్న పాల వెల్లువ, గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ, స్వమిత్ర, గ్రామ వార్డు సచివాలయాలు, ఐసిడిఎస్‌ పనితీరు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను త్వరగతిన పూర్తి చేయాలన్నారు. పూర్తి అయిన భవనాలను ఆయా శాఖలకు అప్పగించాలన్నారు. రెవిన్యూ, పంచాయతీ, మునిసిపల్‌ తదితర శాఖలలో పెండింగ్‌ లో ఉన్న స్పందన అర్జీలు పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించి పిఎం కిసాన్‌ ఆధార్‌ ఈ కేవైసీ పక్రియ పూర్తి చేయాలన్నారు. ఈనెల 30న జగనన్న సురక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సమన్వయంతో వైద్య శిబిరాల ఏర్పాటుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగనవాడీ కేంద్రాలలో బరువు తక్కువ పిల్లలందరినీ అక్టోబర్‌ 1న బరువు తీసి గుర్తించాలన్నారు. జిల్లాలో పలువురు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, సిడిపిఒల పనితీరు బాగాలేదని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి పనితీరు మార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.