ప్రజాశక్తి - పార్వతీపురం : అధిక ప్రాధాన్యత క్రమంలో ఉన్న సమస్యల పరిష్కారం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరిగింది. నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు చేసి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలు చూపేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం రూపొందించారని చెప్పారు. మూడు నెలల్లోపు రాష్ట్రంలోని అనేక సమస్యలు పరిష్కారం కావాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా అధికారులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. సాలూరులో 1.5 ఎకరాల స్థలంలో ట్రక్ బే ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికను తనకు అందజేయాలని మంత్రి కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఉన్నతాధికారులకు పంపిన సమస్యల స్థితిగతులు పరిశీలించి సమాచారం అందించాలని సూచించారు. అత్యంత ప్రాధాన్యత పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలన్నారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పునరావాస పనులు ఇంకా పూర్తి కాకపోవడాన్ని ఉదహరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులను సంప్రదించడం వల్ల సానుకూలంగా, వేగంగా పనులు జరుగుతాయని చెప్పారు. 24 అంగన్వాడీ భవనాలు చిన్న పనులు పూర్తి చేయక అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. సాలూరు - మక్కువ రహదారి రూ.55 కోట్లతో మంజూరైందని, వాటి పనులు పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పునరావాస పనులు, చెరుకుపల్లి గెడ్డ పనులు, అక్వాడేక్ట్ పనులు ప్రాధాన్యతలో చేపట్టాలన్నారు. సురాపాడుపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రహారీ గోడలు, గేట్లు, సి.సి కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉండాలని, ఈ మేరకు జిఒ 40 జారీ చేశామని ఆయన అన్నారు. సాలూరు ఆసుపత్రి భవనాలు నవంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నాలుగు పిహెచ్‌సిల భవనాలు సైతం పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. పాచిపెంటతో పాటు అవసరం ఉన్న ఆసుపత్రులను సామాజిక ఆసుపత్రులు అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా గిరిజన ప్రాంతంలో చేపట్టిన టిడ్కో గృహాలు అని, వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. జిజిఎంపిలో డికెటి పట్టల కోసం ఆర్జీలు అందాయని, వాటికి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు.
జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న రహదారి పనులు అన్ని జిల్లాల్లో ప్రారంభం అయ్యాయన్నారు. అంగన్వాడీ భవనాలు మరమ్మతుల నివేదిక సమర్పిస్తే వాటిని జిల్లా పరిషత్ నుండి మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెదభద్ర, ఇతర గ్రామాలకు వెళ్లే నీటి పథకం నుండి 10 గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు జల జీవన్ మిషన్‌లో ప్రతిపాదించాలని ఆయన సూచించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ శాఖల వారీగా వచ్చే ప్రతిపాదనలు, వాటిపై చర్యలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. ప్రాధాన్యతా భవనాలు పూర్తి చేయాలని సూచించారు. పాత అంచనాలు పరిశీలించి పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ భవనాలు స్థితిగతుల నివేదిక సమర్పించాలని, వాటికి అవసరమైన నిధులు అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. దలైవలస వద్ద పెడ్డగెడ్డపై డైవర్షన్ లో ముంపుకు గురవుతున్న భూములకు, ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు భూములను గుర్తించాలని ఆర్‌డిఒను ఆదేశించారు. ప్రహారీ గోడలు, గేట్లు లేని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. గుమడ లేఅవుట్‌కు విద్యుత్ సౌకర్యంక ల్పించాలని సంబంధిత విద్యుత్‌శాఖ ఇఇని ఆదేశించారు. డిఆర్‌ఒ జె.వెంకట రావు మాట్లాడుతూ సాలూరు నియోజక వర్గంలో మూడు మండలాల్లో 33 గ్రామాల నుంచి 341 మంది లబ్ధిదారులకు 368 ఎకరాలు ఆర్‌ఒఎఫ్‌ఆర్ కింద పంపిణీ చేశామన్నారు. తదుపరి చేసిన సర్వేలో 69మంది లబ్ధిదారులు కొత్తగా వచ్చారని, సబ్ డివిజన్ సమావేశంలో పరిశీలించి మంజూరు చేస్తామని చెప్పారు. చిలక మెండంగి, బంద మెండంగి, తాడిపుట్టి, దోయవర్ మీదుగా మక్కువ మండలం బాగుజోల నుండి సాలూరు మండలం సిరివర వరకు రూ.13 కోట్లతో రహదారి, సాలూరు నుండి చిన పారన్నవలస రహదారిలో వేగావతిపై అసంపూర్ణంగా ఉన్న శివరాంపురం బ్రిడ్జిని రూ.5.95 కోట్లతో నిర్మించేందుకు అంచనాలు తయారు చేశామని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి తెలిపారు. 45 సచివాలయాల భవనాలు, 44 రైతు భరోసా కేంద్రాలు, 39 వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణం జరుగుతున్నాయని, 278 గడప గడపకు మన ప్రభుత్వం పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్‌అండ్‌బి ఆధ్వర్యంలో 7 రహదారులు రూ.15.40 కోట్లతో నిర్మించినట్టు ఆర్ అండ్ బి అధికారులు చెప్పారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పునరావాస పనులు రూ.7.92 కోట్లకు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, చెరుకుపల్లి గెడ్డ పనులు రూ.4.67 కోట్లతో ప్రతిపాదించగా ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని, విఆర్‌ఎస్‌పై అక్వడేక్ట్ పనులు రూ.5.70 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చామని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారి ఆర్.అప్పారావు తెలిపారు. అడారుగెడ్డకు దుగ్గేరు వద్ద ఆనకట్ట కట్టుటకు రూ.4.50 కోట్లతోను, దలైవలస వద్ద పెద్దగెడ్డపై డైవర్షన్ స్ట్రక్చర్ నిర్మాణానికి రూ.3 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదించామని అన్నారు. ఇక్కడ గిరిజనులు సాగు చేస్తున్న భూములు ముంపునకు గురవుతాయని, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని అన్నారు. పెదభద్ర, ఇతర గ్రామాలకు వెళ్లే నీటి పథకం నుండి 10 గ్రామాలకు నీటిని సరఫరా చేయుటకు రూ.12.08 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించామని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు తెలిపారు. నియోజకవర్గంలో 22 రహదారులు అసంపూర్తిగా ఉన్నాయని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి శాంతీశ్వర రావు తెలిపారు. వర్షా కాలం ముగియగానే పనులు పూర్తి చేస్తామన్నారు. ఇఎ గ్రాంట్‌లో వచ్చిన ఏడు రహదారుల్లో నాలుగు రోడ్లు ప్రారంభించామని ఆయన చెప్పారు. 22 బ్లాకుల్లో 1248 టిడ్కో గృహాలు నిర్మాణం జరుగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి అవుతాయని డిఇ తెలిపారు. మౌళిక సదుపాయాలు కల్పనకు రూ.7.76 కోట్లతో పనులు మంజూరయ్యా యని ఆమె తెలిపారు. మున్సిపల్ కమిషనర్ హెచ్.శంకరరావు మాట్లాడుతూ పట్టణంలో రూ.కోట్లతో పార్కు నిర్మాణానికి ప్రతిపాదించా మన్నారు. సాలూరు అత్యధిక లారీలు ఉన్న ప్రాంతమని, ఆటో నగర్ అవసరమని, రూ.10 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, ఆర్‌డిఒ కె.హేమలత, అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు, సాలూరు నియో జకవర్గ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో తీర్మానాలు
అనంతరం జిల్లాలో గృహ అవసరాలు ఎక్కువగా ఉన్నందున, ఇప్పటికే సొంత స్థలాలుగా గుర్తించిన లబ్దిదారులతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన అర్జీలను కూడా మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
గిరి శిఖర ప్రాంతాలు వంటి విభిన్న భౌగోళిక ప్రాంతాలు ఉన్న దృష్ట్యా యూనిట్ ఖరీదు అదనంగా కొంత మొత్తం మంజూరుకు తీర్మానించారు.
సాలూరులో ఇపిడిసిఎల్ ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఒకే విభాగం నుండి సేవలు అందిస్తున్నందున ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా రెండుగా విభజించాలని తీర్మానించారు.










