టిడిపి, జనసేన పొత్తుపై పవన్‌కల్యాణ్ స్పష్టత
జిల్లాలో ఇరుపార్టీల నేతల్లో చర్చలు
సీట్ల పంపకాలపై ఎవరి లెక్కలు వారివే
ఏయే సీట్లలో ఎవరెవరు బరిలోకి దిగుతారంటూ సర్వత్రా చర్చ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : అంతా ఊహించుకుంటున్నట్లుగానే టిడిపి, జనసేన మధ్య పొత్తు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసే పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో టిడిపి, జనసేన పొత్తుపై దిగువస్థాయిలో ఆయా పార్టీల శ్రేణుల్లో నెలకొన్న సందేహాలు పటాపంచలయ్యాయి. దీనికి బిజెపి కలిసొస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ బిజెపి రాకపోయినా టిడిపితో పొత్తు ఖాయమన్నట్లు పవన్ చేసిన ప్రకటన టిడిపి శ్రేణుల్లో ఉత్సాహన్నిచ్చిందని చెప్పొచ్చు. చంద్రబాబు అరెస్టు నేపథ్యం దగ్గర నుంచి జనాల్లో సానుభూతి ఉన్నా ప్రభుత్వ నిర్బంధం, ఇతర కారణాల రీత్యా టిడిపి శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అక్కడికీ పోలీసు నిర్బంధానికి ఎదురొడ్డుతూ పాలకొల్లు, తణుకు తదితర ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబుకు రిమాండ్, ఆపై బెయిల్ రాకపోవడం, లోకేష్‌ను సైతం అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత అలజడి నెలకొంది. ఈ క్రమంలో జనసేనాని పొత్తు ప్రకటనతో టిడిపి శ్రేణులకు ఉత్సాహంతోపాటు ధైర్యాన్నిచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే క్రమంలో గోడమీద పిల్లివాటంలా బిజెపి ఎప్పటిలానే పొత్తుల సంగతి తమ జాతీయ నేతలు చూసుకుంటారని, పవన్‌తో తమ పొత్తు కొనసాగుతుందని ప్రకటించడం వెనుక మర్మమేమిటా అని అంతా తర్జనభర్జనలు పడుతున్నారు.
పవన్ కల్యాణ్ ప్రకటనతో జిల్లాలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఒకరకమైన జోష్ నెలకొంది. జనసేనకు ఉన్నంతలో బలమైన ఓటుబ్యాంకు ఉన్న జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాది అగ్రస్థానమే. పలు నియోజకవర్గాల్లో కాపు సామాజిక తరగతి ఓట్లు ఎక్కువగా ఉండటం, వారితో ఎక్కువ శాతం జనసేనకు అండగా ఉంటున్న పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి స్పష్టంగా కన్పిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక
సంస్థల ఎన్నికల్లో టిడిపి, జనసేన పరస్పర అవగాహనతో పోటీకి దిగడం కూడా వైసిపికి గట్టిపోటీనిచ్చినట్లయ్యింది.
గత సాధారణ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పటికీ జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు వంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం చూపింది. నాడు వామపక్షాల సహకారంతో పలు నియోజకవర్గాల్లో టిడిపిని వెనక్కినెట్టి రెండోస్థానంలో జనసేన నిలిచిన పరిస్థితి ఉంది. నాటి కంటే ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన నిర్మాణం బలపడటంతో క్షేత్రస్థాయిలో సైతం బలం పెరిగినట్లు కనిపిస్తోంది. ఒంటరిగా పోటీచేస్తే గెలవడం కష్టసాధ్యమని, టిడిపితో కలిసి ఎన్నికలకు వెళ్తే వైసిపిని ఓడించొచ్చని జనసేనాని యోచిస్తున్నట్లు కొంతకాలంగా విస్తృత చర్చ సాగుతోంది. వైసిపి ప్రభుత్వ దుందుడుకు వైఖరి, నిర్బంధాల రీత్యా టిడిపి కూడా అదేవిధంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది. జనసేన ప్రస్తుతం ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉంది. బిజెపితో కలిసి జనసేనాని పని చేస్తున్నారు. బిజెపి మాత్రం టిడిపితో పొత్తుకు సంసిద్ధంగా లేన్నట్లు సంకేతాలిస్తూ వస్తోంది. బిజెపి టిడిపితో పొత్తుకు ఒప్పుకోకపోతే పవన్ టిడిపితో పొత్తు పెట్టుకుంటారా అనే అనుమానాలు ఇరుపార్టీల నేతల్లోనూ నెలకొంది. అయితే గురువారం రాజమండ్రిలో పవన్ చేసిన ప్రకటనతో ఆ అనుమానాలన్నీ పక్కకుపోయాయి. ఇక ఎవరెవరు ఎక్కడ పోటీ చేసే అవకాశం ఉందనే అంశంపై సమాలోచనలు ప్రారంభమయ్యాయి.
సీట్ల పంపకాలపై చర్చలు
టిడిపి, జనసేన పొత్తు ఖాయమని పవన్ ప్రకటించడంతో జిల్లాలో అసెంబ్లీ సీట్ల పంపకాలపై ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల్లో పెద్దఎత్తున చర్చ సాగుతోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రాతిపదికన లెక్కిస్తే 14 ఎంఎల్‌ఎ, రెండు ఎంపీ స్థానాలున్నాయి. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఏలూరు మొత్తం ఐదు స్థానాలను జనసేన కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉంగుటూరు స్థానానికి సంబంధించి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పత్సమట్ల ధర్మరాజు ఉన్నారు. ఈయన గత కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన పరిస్థితి ఉంది. ఇదే నియోజకవర్గంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ గన్ని వీరాంజనేయులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టిడిపి ఉంగుటూరు స్థానాన్ని జనసేనకు కేటాయిస్తుందా అనే అనుమానాలున్నాయి. ఏలూరులో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మాజీ ఎంఎల్‌ఎ బడేటి బుజ్జి సోదరుడు చంటి వ్యవహరిస్తున్నారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన రెడ్డి అప్పలనాయుడు ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ కూడా ఏ పార్టీ బరిలోకి దిగుతుందనే దానిపై సందిగ్ధత నెలకొంది. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం సీట్ల విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని లెక్కలు వేస్తున్నారు. సీట్ల పంపకాలకు వచ్చేసరికి జిల్లాలో పొత్తు ఏ విధంగా ఉంటుందో వేచిచూడాలి.










