ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రానున్న సాధారణ ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయ్యింది. దీంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల్లో టికెట్ల కోసం ఆశావహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలోనే జనసేనకు బలమైన జిల్లాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓట్ల సంఖ్య దాన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు.
పొత్తులు, ఎత్తులు
రాజకీయ పొత్తులు, ఎత్తులు విషయంలో టిడిపి, జనసేన పార్టీ ఇప్పుడు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లో కలిసి బరిలో దిగిన పార్టీలు మరోసారి ఎన్నికల బరిలోకి ఉమ్మడిగా అడుగుపెట్టడం అనివార్యమయింది. అయితే అప్పట్లో జనసేన పోటీ చేయకుండా టిడిపికి మద్దతు ఇచ్చింది. దీంతో బిజెపి, జనసేన, టిడిపి కూటమి జిల్లాలో నాటి 19 సీట్లకుగాను 15 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేసి టిడిపి కేవలం నాలుగు సీట్లకు పరిమితం కాగా జనసేన రాజోలు స్థానంలో మాత్రం గెలిచింది. గత ఎన్నికల్లో జిల్లాలో జనసేన 14 శాతం ఓట్లు సాధించింది. టిడిపికి పెద్దాపురం, మండపేట, రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ స్థానాల్లో విజయంతో పాటుగా మిగిలిన 15 స్థానాల్లోనూ రెండో స్థానం దక్కింది. 34 శాతం వరకు ఆ పార్టీకి ఓట్లు దక్కాయి. దాదాపు 49 శాతం ఓట్లు సాధించిన వైసిపి తిరుగులేని ఆదిత్యాన్ని ప్రదర్శించి జిల్లాలో తన జెండా ఎగురవేసింది.
జనసేన ఎక్కువ సీట్లు ఆశించే అవకాశం
రాష్ట్రంలోనే జనసేనకి ఎక్కువ ఓట్లు వచ్చిన ఉమ్మడి జిల్లా కావడం, గెలిచిన ఏకైక సీటు కూడా ఇక్కడే ఉండడంతో జనసేన ఎక్కువ సీట్లను ఇక్కడే ఆశించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అటు టిడిపి, ఇటు జనసేన నేతలు అప్రమత్తమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో తమ ఉనికిని చాటుకునే యత్నాలు మొదలు పెట్టారు. ఎవరికి వారే ఆ సీటు తమదేననే ధీమాతో సాగుతున్నారు. 2019 ఎన్నికల్లో లభించిన ఓట్లు ఆధారంగా ఎవరు ఎక్కడ బలంగా ఉంటే ఆయా స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని టిడిపి నేతలు ఆశిస్తున్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల్లో ప్రస్తుతం మూడు జిల్లాల్లో జనసేనదే అధిక్యమని ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. రాజోలు నుంచి గెలిచిన ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాద్ పార్టీ ఫిరాయించారు. కానీ అక్కడ జనసేనకు బలం ఇంకా ఎక్కువగా ఉందని జెఎస్‌పి భావిస్తోంది. ఇలా పలుచోట్ల యువతలో మంచి ఫాలోయింగ్ ఉండడం, బలమైన సామాజికవర్గంలో మెజారిటీ ఓటర్లు అండగా ఉండడం, రాజకీయంగా అధికార పార్టీతో ఢ అంటే ఢ అనేలా వ్యవహరిస్తుండడం వంటి కారణాల రీత్యా తమకే మెజార్టీ సీట్లు దక్కుతాయని జనసేన నాయకుల్లో కనిపిస్తోంది.
టికెట్ల కోసం కుస్తీ పట్లు తప్పవా..?
మూడు జిల్లాల పరిధిలో రాజోలుతోపాటు అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, తుని, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, పెద్దాపురం వంటి అసెంబ్లీ స్థానాలను జనసేన ఆశించే అవకాశం కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా వీటిలో అనేక స్థానాల్లో బలమైన నేతలు ఉన్నారు. ప్రధానంగా రాజమండ్రి రూరల్, పెద్దాపురం వంటి ప్రాంతాల్లో సిట్టింగ్ ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంఎల్‌ఎలకు ఆయా స్థానాలను కేటాయిస్తున్నట్టు టిడిపి అధినేత కూడా ప్రకటించారు. మెట్ట ప్రాంతంలో బలమైన నాయకుడు, టిడిపి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఉండగా జగ్గంపేట సీటుని జనసేనకు కేటాయించే అవకాశం లేదు. మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్ వర్మ కచ్చితంగా పిఠాపురం నుంచే పోటీ చేస్తానని గతంలోనే స్పష్టం చేసారు. కానీ బలమైన కాపు సామాజికవర్గం ఉన్న నియోజకవర్గం కాబట్టి జనసేన ఈ టిక్కెట్ ఆశిస్తోంది. పొత్తులో జనసేనకు కేటాయిస్తే స్వాతంత్య్ర అభ్యర్థిగా పోటీలో ఉంవర్మ తన అనుచరులతో ఇప్పటికే చర్చించారు. దీంతో ఇలాంటి సీట్లు కొన్నింటిపై ఇరు పార్టీల మధ్య సఖ్యత ఎలా కుదురుతుందనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని స్థానాల్లో రాజీ పడినప్పటికీ ఇలాంటి కీలక నియోజకవర్గాల విషయంలో సిగపాట్లు తప్పే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కిందస్థాయి నేతలను సర్థుబాటు చేయడం టిడిపి, జనసేన పార్టీలకు కత్తిమీద సాముగా మారనుంది. ఇదే సందర్భంలో ఓట్ల బదిలీ అంశం కూడా కీలకంగా మారనుంది.










