టిడిపి, జనసేన పొత్తుపై ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ
ఆశావహులైన టిడిపి, జనసేన నేతల్లో గుబులు
పొత్తులో జనసేనకు కేటాయించే స్థానాలపై ఎవరి లెక్కలు వారివే
ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపుతో టిడిపి శ్రేణుల్లో పెరిగిన జోష్
ఎంపీ స్థానాల కేటాయింపుపైనా లెక్కలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో రాజకీయపార్టీల పొత్తులపై క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఏ నలుగురు కలిసినా టిడిపి, జనసేన పొత్తుపైనే మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపుతో టిడిపి శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు, పొత్తులపైనే గ్రామ, పట్టణాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజానీకంలోనూ చర్చలు సాగుతున్నాయి. టిడిపి, జనసేన పొత్తు ఖాయమనే భావన ఆ పార్టీల శ్రేణుల్లో గట్టిగా కన్పిస్తోంది. అదే సమయంలో టిడిపి, జనసేన పొత్తు ఖాయమైతే జిల్లాలో ఏ స్థానాలను జనసేనకు కేటాయిస్తారనే దానిపై ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే 15 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో కాపు సామాజిక తరగతి ఎక్కువగా ఉండటంతో జనసేనకు ఓటింగ్ శాతం కూడా ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం వంటి స్థానాల్లో జనసేన ప్రధాన పార్టీలకు దీటుగా నిలబడింది. దీంతో తక్కువగా లెక్కించినా జిల్లాలో ఏడు స్థానాల వరకూ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో స్థానాల కేటాయింపునకు సంబంధించిన పేర్లు సైతం బాహాటంగానే విన్పిస్తున్నాయి. మరోపక్క టిడిపి, జనసేన పొత్తు కుదిరితే అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న టిడిపి జనసేన నాయకుల్లో తమ పరిస్థితి ఏమిటనే గుబులు సైతం నెలకొంది. పొత్తులో భాగంగా టిక్కెట్ రాకపోతే ఏమిటనే ప్రశ్న ఆశావహులను తొలిచేస్తోంది.
టిక్కెట్‌పై ఎవరి టెన్షన్ వారిదే..
టిడిపి, జనసేన పొత్తు ఖాయమైతే ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఏలూరు స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీలుగా ఉంగుటూరుకు మత్సపట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడేనికి బొలిశెట్టి శ్రీనివాస్, ఏలూరుకు రెడ్డి అప్పలనాయుడు, నరసాపురానికి బొమ్మిడి నాయకర్ వంటి వారున్నారు. పాలకొల్లు, భీమవరంల్లో సమర్ధులైన నాయకులను బరిలో దింపాలనే యోచనలో సైతం జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆ నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన నాయకులు, మాజీ ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఉంగుటూరుకు ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పాలకొల్లులో ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, ఏలూరులో బడేటి కుటుంబం, భీమవరంలో తోట సీతారామలక్ష్మి కుటుంబం, నరసాపురంలో బండారు మాధవనాయుడు, తాడేపల్లిగూడెంలో మాజీ జెడ్‌పి ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వంటి నాయకులు ఉన్నారు.
పొత్తు కుదిరి ఈ స్థానాలు జనసేనకు కేటాయిస్తే వీరి భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విధంగా జరిగితే ఎన్నికల్లో వీరంతా జనసేకు సహకరిస్తారా లేక అసంతృప్తితో ధిక్కార స్వరం వినిపిస్తారా అనే చర్చ జనాల్లో నడుస్తోంది. ఏదేమైనా పొత్తు ఖాయమైతే జనసేనకు జిల్లాలో ఏడు సీట్లు ఖాయమనే అభిప్రాయాన్ని ఆ పార్టీ శ్రేణులు బలంగా చెబుతున్నాయి. నరసాపురం ఎంపీ స్థానం జనసేనకు కేటాయిస్తారనే చర్చ సైతం నడుస్తోంది. పొత్తులో బిజెపి ఉంటే ఆ పార్టీకి ఏ స్థానాలు కేటాయించే అవకాశం ఉందనే మరో చర్చ సైతం సాగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పొత్తులపై క్షేత్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది.










