ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తుపెట్టుకుంటామని రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.2014లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీచేయడం వల్ల అప్పట్లో ఉమ్మడి జిల్లాలో టిడిపి12 సీట్లు కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి వేర్వేరుగా పోటీ చేయగా జిల్లాలో టిడిపి ఘోరపరాజయం చవిచూసింది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు ఓట్లు భారీగా రాగా మరికొన్ని నియోజకవర్గాల్లో స్వల్పంగా ఓట్లు వచ్చాయి. ఈ మూడు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల మెజార్టీ నియోజకవర్గాల్లో వైసిపికి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ఈసారి జనసేన, టిడిపి కలిస్తే తమకు నష్టమేనని వైసిపి నాయకులు నర్మగర్భంగా అంగీకరిస్తున్నారు.
2019లో తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరుపశ్చిమ, గుంటూరు తూర్పు, రేపల్లే నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు ఓట్లు గణనీయంగా వచ్చాయి. జనసేన కలిసి ఉంటే తమ అభ్యర్థులు గెలిచి ఉండేవారని 2019 ఎన్నికల తరువాత టిడిపి నాయకులు వాపోయారు. జనసేనతో వామపక్షాలు, బిఎస్‌పి పొత్తు ఉండటం వల్ల 2019లో తాడికొండలో బిఎస్‌పి అభ్యర్థికి 4992 ఓట్లు, మంగళగిరిలో సిపిఐ అభ్యర్థి 10,135 ఓట్లు సాధించారు. జనసేన అభ్యర్థులు భారీగా ఓట్లు సాధించినా రేపల్లె, గుంటూరు పశ్చిమలో టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. మిగతా 15 నియోజక వర్గాల్లో వైసిపి ఓటమి పాలయింది.
నర్సరావుపేట లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. అప్పట్లో వైసిపి అభ్యర్థులు భారీ ఆధిక్యతతో గెలుపొందారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో గత ఎన్నికల్లో జనసేన ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆపార్టీ సిద్ధపడటంలేదని తెలిసింది. జనసేన టిడిపి కలిసి పోటీ చేస్తే వైసిపి వ్యతిరేక ఓటు ఈ కూటమికి దక్కుతుందని కానీ బిజెపితో కలిస్తే మాత్రం టిడిపికి భారీ నష్టం ఉంటుందనే అభిప్రాయం టిడిపి సీనియర్లలో వ్యక్తమవుతోంది. వైసిపికి ఉన్న ఓటు బ్యాంకులో మెజార్టీ ఓట్లు బిజెపిని వ్యతిరేకించే ఓటర్లు అధికంగా ఉన్నారు. అయితే వైసిపి ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిగా ఉన్న వారు వెంటనే తమ వ్యతిరేకతను వ్యక్తం చేయాలంటే టిడిపి, జనసేన, వామపక్షాల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. బిజెపితో టిడిపి పొత్తు ఉంటే మాత్రం వ్యతిరేక ఓట్లు యథాతథంగా వైసిపికి లేదా ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల టిడిపికి రాజకీయంగా ఉపయోగం ఉండదని చెబుతున్నారు.
టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే గుంటూరు జిల్లాలో ఇప్పటికే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని పవన్‌కల్యాణ్ ఇటీవల స్వయంగా ప్రకటించారు. గుంటూరు నగరంలో కూడా ఒక సీటు జనసేన కోరే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జనసేనతో పొత్తు వల్ల తమకు దక్కాల్సిన సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని టిడిపి నేతలు మధనపడుతున్నారు. నాదెండ్ల మనోహర్ అభ్యర్ధిత్వం ఖరారైతే మాజీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరో నియోజకవర్గం వెళ్లాల్సి రావచ్చు. దీంతో ఆయన వర్గీయులు కొంత గందరగోళంలో ఉన్నారు. కోస్తా జిల్లాల్లోనే జనసేన ఎక్కువ సీట్లు అడుగుతుందని ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోనే మరో సీటు కూడా అడుగుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
నియోజకవర్గం- వైసిపి- టిడిపి- జనసేన- విజేత ఆధిక్యత
తెనాలి 94495 76,846 29905 17649
పొన్నూరు 87,570 86,458 12303 1112
ప్రత్తిపాడు 92,508 85,110 26,371 7398
మంగళగిరి 1,08,464 1,03,127 10135 (సిపిఐ) 5337
తాడికొండ 86,848 82,415 4992 (బిఎస్‌పి)4433
తూర్పు 77047 54,956 21,508 22,091
పశ్చిమ 67575 71864 27869 4289
చిలకలూరిపేట 94,430 86,129 2,958 8,301
నర్సరావుపేట 1,00,994 68,717 8,746 32,277
సత్తెనపల్లి 1,05,063 84,187 9,279 20,876
వినుకొండ 1,20,703 92,075 4,637 28,628
పెదకూరపాడు 99,577 85,473 7,198 14,104
గురజాల 1,17,204 88,591 7,198 28,613
మాచర్ల 1,10,406 88,488 12,503 21,918
రేపల్లె 78,420 89,975 11,761 11,555
బాపట్ల 79,836 64,637 4,006 15,199
వేమూరు 81,671 71,672 13,038 9,999










