Aug 13,2023 21:26


ఎన్నికల పొత్తులపై రాజకీయ నేతల్లో చర్చ
టిడిపి, జనసేనలపై ప్రజల సమాలోచనలు
పొత్తు కుదిరితే సీట్ల పంపకంపైన ఊహాగానాలు
జనసేన వారాహి యాత్రతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఏడాదిలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల పొత్తులపై జిల్లా రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా టిడిపి, జనసేన పొత్తుపై ఆయా పార్టీనాయకులతో పాటు జనాల్లోనూ తీవ్ర చర్చ కొనసాగుతోంది. గ్రామ, పట్టణాల్లో ఏ ఇద్దరు కలిసినా టిడిపి, జనసేన పొత్తుగురించి మాట్లాడుకుంటున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో చేపట్టిన మొదటివిడత వారాహి యాత్ర ఆపార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సహం నింపినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకులు వివిధ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇటీవల అడవికొలను, నిడమర్రు రోడ్డు గురించి ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్ర అంతటా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పొత్తు కుదరకపోతే టిడిపి, జనసేన ఇరు పార్టీలూ నష్టపోతాయని, పొత్తు కుదిరితే జిల్లాలో అన్నిసీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని ఇరుపార్టీల నాయకులు అంచనా వేస్తున్నారు. అదేసమయంలో పొత్తుకుదిరితే జనసేనకు ఏయే సీట్లు ఇస్తారన్న అంశంపైనా జనాల్లో చర్చ నడుస్తోంది. రెండు జిల్లాలోనూ 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన పొత్తుతో ముందుకు సాగాయి. జనసేన ప్రత్యక్షంగా అభ్యర్థులను పోటీకి దింపకపోయినా టిడిపికి అండగా నిలిచింది. దీంతో ఉమ్మడిజిల్లాలోని 15 సీట్లను టిడిపి కైవసం చేసుకుంది. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ, నరసాపురం ఎంపీస్థానాల్లో బిజెపి అభ్యర్థులు గెలిచారు. 2019లో పొత్తులేకుండా టిడిపి, జనసేన , బిజెపి ఒంటిరిగా ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో 15 స్థానాలకుగాను వైసిపి 13 స్థానాలను గెలుచుకోగా, టిడిపి రెండుస్థానాలకే పరిమితమైంది. జనసేన ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. భీమవరం స్థానంలో పోటీచేసిన జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ సైతం ఓటమిపాలయ్యారు. నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం వంటి స్థానాల్లో జనసేన అభ్యర్థులు రెండోస్థానంలో నిలిచినప్పటికీ గెలుపుమాత్రం సాధించలేకపోయారు. ఓట్లు విడిపోవడం కారణంగా వైసిపికి అత్యధిక సీట్లు వచ్చాయని టిడిపి, జనసేన నాయకులు అంచనా వేశారు. ఈసారి పొత్తుతోనే ఎన్నికల బరిలో దిగాలని జనసేన భావిస్తోంది. అందుకు తగినట్లుగానే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. ఉమ్మడి పశ్చిమలో కాపు సామాజిక తరగతి జనాభా ఎక్కువగా ఉంది. కాపు సామాజిక తరగతి ఈసారి జనసేన వైపు నిలిచే అవకాశం ఉన్నట్లు లెక్కలు కడుతున్నారు. దీంతో పొత్తుపెట్టుకుంటే రెండు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రోడ్లు వేయకపోవడం, తాగునీరు గురించి పట్టించుకోకపోవడం, చెత్తపన్ను, విద్యుత్‌ బిల్లుల పెంపు, ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు వంటి అనేక అంశాలు అధికార పార్టీ వైసిపికి ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
జనసేన పోటీ ఏయే స్థానాల్లో?
పొత్తు కుదిరితే జనసేన జిల్లాలో ఐదుస్థానాల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉంగుటూరు, ఏలూరు నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లోనూ ఈ స్థానాల్లో జనసేన తన ప్రభావం చూపింది. అయితే ఆయా స్థానాల్లో టిడిపికి బలమైన అభ్యర్థులున్నారు. జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరంజనేయులు ఉంగుటూరుకు, ఏలూరుకు బడేటి బుజ్జి సోదరుడు చంటి, తాడేపల్లిగూడేనికి ముళ్లపూడి బాపిరాజు వంటి సీనియర్‌ నాయకులున్నారు. పొత్తులో ఈ సీట్లు జనసేనకు ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు ఏవిధంగా ఉంటుందోనన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. ఏది ఏమైనా టిడిపి, జనసేన పొత్తుఖాయమన్న రీతిలో ఆయా పార్టీల నాయకులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. పొత్తు పొడుస్తుందో లేదో వేచిచూడాల్సి ఉంది.