Sep 03,2023 22:14

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : బాపట్ల జిల్లా సంతమాగులూరు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా మరో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. మృతులు గుంటూరు నగరం నల్లచెరువు, ఆదర్శ నగర్‌, గోరంట్ల ప్రాంతానికి చెందిన అలివేలు మంగ తాయారు (18), బెలిమెళ్ల కవిత (19) , పాల్తీనరి నాయక్‌ (19), బుర్రి మాధవి (35), తమ్మిశెట్టి తులసి (16)గా గుర్తించారు. వీరు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక శుభకార్యంలో అతిథులను ఆహ్వానించడం, వారికి తినుబండారాలు, శీతల పానీయాలు అందించే పనికి ఒప్పందం చేసుకుని రూ.800 కూలీ మాట్లాడుకున్నారు. అందులో భాగంగా గుంటూరు నుండి బస్సులో బయలుదేరి శుక్రవారం సాయంత్రానికి శుభకార్యంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి శుభకార్యం ముగిసిన అనంతరం మార్కాపురం నుండి నరసరావుపేట వరకు ఆటో మాట్లాడుకొని తిరిగి వస్తున్న క్రమంలో తెల్లవారుజామున వర్షం తీవ్రతకు రోడ్డు మార్గం కనిపించకపోవడంతో ఎదురుగా లారీ ఢకొీనడంతో ప్రమాదం వాటిల్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఐదుగురు చెందారు. ఘటనా స్థలానికి బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని, గురైన ఆటోను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆటోను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి మార్కాపురం వైపు ఇడ్లి రవ్వ లోడుతో వెళుతున్న లారీ ఢ కొట్టిందన్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్‌, క్లినర్‌ను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు. మృతదేహాలను నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ఘోర ప్రమాదం చోటుచేసుకున్నా మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు న్రపభుత్వం నుండి ప్రకటనేమీ రాలేదని కుటుంబీకులు వాపోతున్నారు. పొట్టకూటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావడం బాధాకరమని, ఎంతో భవిష్యత్‌ ఉన్న 20 ఏళ్లలోపు వారూ మృతి చెందడం బాధాకరమని స్థానికులు ఆవేదనకు గురయ్యారు.