
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: అమరజీవి పొట్టిశ్రీరాములును ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అక్కడ నుంచి అధికారులతో కలసి పాత బస్టాండ్ కూడలికి చేరుకుని అక్కడ పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టిశ్రీరాములు రెండు నెలల పాటు ఉపవాస ఉంటూ దీక్ష చేశారని అన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఆయన చేసిన ప్రాణ త్యాగం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన త్యాగాన్ని స్మరించుకునే విధంగా నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు పేరును పెట్టారని గుర్తు చేశారు. త్యాగధనుల స్ఫూర్తితో అధికారులు ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదామన్నారు. ఆయన త్యాగాలను మరువలేనివని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ఆర్‌డిఒ సిహెచ్.రంగయ్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరవు, జిల్లా ఖజానాశాఖ అధికారి రవికుమార్, కలెక్టరెట్ ఎఒ రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేషు పాల్గొన్నారు.