ప్రజాశక్తి -అనకాపల్లి
అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో దేశ సేవ చేయాలని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి, తెలుగు ప్రత్యేక రాష్ట్రం కోసం 56 రోజులు ఆమరణ దీక్ష చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయన పోరాట పటిమతో యువత ముందుకు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ వెంకటరమణ, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి కె.రాజేశ్వరి, ఏబిసిడబ్ల్యూఓలు సురేష్, నాగేశ్వరరావు, నరసింహమూర్తి, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామచంద్ర థియేటర్ కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైసిపి పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, కార్పొరేటర్ మందపాటి సునీత నివాళులర్పించారు. ఆళ్ల నాగేశ్వరరావు, గైపూరి రాజు, పలక సత్యనారాయణ, నడిశెట్టి మధు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి మెయిన్ రోడ్డులోని కన్యక పరమేశ్వరి దేవస్థానం కూడలిలో టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. సూరి సతీష్, బోడి వెంకటరావు, కుప్పిలి జగన్మోహన్, మల్ల గణేష్ దూలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్ : స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో జయరామ్ పొట్టి శ్రీరాములు వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ పలితంగానే దేశంలో భాషా ప్రయక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పడిందన్నారు.స్థానిక పాల్ ఘాట్ సెంటర్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయుష్మాన్ భవ వాసవి క్లబ్ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు.
నక్కపల్లి :మండలంలోని చినదోడ్డిగల్లు గ్రంథాలయంలో గ్రంధాలయ అధికారి జనార్దన్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అప్పారావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అప్పలరాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది రమణమ్మ పాల్గొన్నారు.










