ప్రజాశక్తి -అనకాపల్లి : అమర జీవి పొట్టి శ్రీరాములు ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ రవిసుభాష్ పటాన్‌శెట్టి కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెసి కల్పనాకుమారి, డిఆర్‌ఒ వెంకటరమణలతో కలిసి అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి గౌతమిసాలి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ముందుగా కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదనపు ఎస్‌పి విజయభాస్కర్, సిఐలు నరసింహారావు, చంద్రశేఖర్, అప్పలనాయుడు, రామకృష్ణారావు, సతీష్, వెంకట్రావు,పాల్గొన్నారు.
కన్యకా పరమేశ్వరి దేవస్థానం జంక్షన్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ, టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పూలమాల వేసి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సూరే సతీష్, కడిమిశెట్టి నరసింగరావు, ధనాల విష్ణు చౌదరి, కే రామకష్ణ, మల్లేశ్వరరావు, అప్పలాచారి భువనేశ్వర రావు పాల్గొన్నారు. సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బల్ల నాగభూషణం ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి సబ్ జైలు సూపరింటెండెంట్ డబ్బేరు కిరణ్‌కుమార్ నివాళులర్పించారు.
నక్కపల్లి:స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం హెచ్‌ఎమ్ రాణీలలిత ఆధ్వర్యంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రుల ఆశయసాధన కోసం ఆత్మార్పణ చేసుకుని ఆంధ్రుల చిరకాల వాంఛితమైన ఆంధ్రరాష్టం అవతరణకు కారకులు పొట్టి శ్రీరాములని హెచ్‌ఎం అన్నారు. తెలుగు ఉపాధ్యాయులు ఎన్.వి.ఎస్ ఆచార్యులు ఆంధ్రోద్యమ చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఆంధ్రుల ఆశయసాధన కోసం తన ప్రాణాలనే తృణప్రాయంగా వదిలిన త్యాగధనుడుగా ప్రజల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అప్పారావు, బాబూజీ, సత్యవతి, ఎన్.వి.ఎస్.ఆచార్యులు, టి.వి.రమణ, సత్తిబాబు, కుందూరు రాజు, పద్మావతి, అనంతలక్ష్మి, సుమబిందు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్: పట్టణంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములకు ఘననివాళలు అర్పించారు. వాసవి కళ్యాణ మండప సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో స్థానిక పాల్గాట్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యనిర్వాహక సభ్యులు, ఎన్నారై వాసవి అసోసియేషన్ కన్వీనర్ వెలగా నారాయణరావు మాట్లాడుతూ, దేశంలో భాషా ప్రయోక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణమండప సంఘం అధ్యక్షులు జాలుమూరి బంగారాజు, వాసవి ఆయుష్మాన్ క్లబ్ అధ్యక్షుడు కుసుమంచి వెంకటకృష్ణ, వాసవి క్లబ్ కార్యదర్శి పెనుగొండ రమేష్ వాసవి వనిత క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెయిన్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










