Nov 01,2023 21:02

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. తాడేపల్లిగూడెంలో వాసవి కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు విగ్రహానికి మంత్రి కొట్టు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములుకు తెలుగుజాతి యావత్తూ రుణపడి ఉంటుందన్నారు. ఆయన ప్రాణ త్యాగం చేసి సాధించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా మార్చేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. అమర జీవి త్యాగనిరతిని గాలికొదిలేసి రాష్ట్రం రెండు ముక్కలైపోవడానికి చంద్రబాబు కారకుడయ్యాడన్నారు. టిడిపి నాయకులకు ఎంతసేపు కేసుల నుంచి ఎలా బయటపడాలని ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచించే సమయం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ ముప్పిడి సంపత్‌ కుమార్‌, సిజిఎఫ్‌ కమిటీ మెంబర్‌ కర్రి భాస్కరరావు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మండవల్లి చెన్నా నాగేంద్రరావు పాల్గొన్నారు.
భీమవరం : తెలుగు రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి, పురోభివృద్ధికి స్వతంత్ర బాటలు వేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కలెక్టరేట్‌ ఆవరణలో బుధవారం జరిగింది. తొలుత కలెక్టర్‌ పి.ప్రశాంతి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ఎస్‌పి యు.రవి ప్రకాష్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. రామ్‌ సుందర్‌ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగఫలితమే భాష ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించిందన్నారు. త్యాగధనుల స్ఫూర్తితో అధికారులు ప్రజలకు ఉత్తమ సేవలందించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథం వైపు పయనిస్తోందన్నారు. జెసి రామ్‌ సుందర్‌ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మృతి చెందడంతో ప్రత్యేక తెలుగురాష్ట్రం ఉద్యమం తీవ్రతరం అవడంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రానికి 1953లో చట్టం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్‌, జిల్లా ఎఎస్‌పి ఎవి సుబ్బరాజు, డిఆర్‌ఒ కె.కృష్ణవేణి పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌: రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని నరసాపురం ఆర్‌డిఒ ఎం.అచ్యుత అంబరీష్‌ అన్నారు. బుధవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఆర్‌డిఒ అచ్యుత అంబరీష్‌, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం ఫలంతో పాటు అనేకమంది పోరాట ఫలితంగా ఏర్పాటైన రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఎఒ నాగార్జున, సిబ్బంది పాల్గొన్నారు.