Nov 01,2023 20:05

పొట్టి శ్రీరాములుకు నివాళ్లు అర్పిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలితమని, దేశంలో అనేక భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆద్యుడని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణను పురష్కరించుకొని బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రావతరణ ఉత్సవాలకు కలెక్టరు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకే బాష మాట్లాడే వారికి ఒకేరాష్ట్రం ఉండాలని, వివక్షకు గురవుతున్న తెలుగువారికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. వారి త్యాగఫలితంగా 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు దేశం, రాష్ట్రం అభివృద్ధికి కృషిచేయాలని, ప్రజల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వంటి స్వాతంత్య్రసమయయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి ఆర్‌.ఉమామహేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి బి.జగన్నాధరావు, డిపిఆర్‌ఒ ఎల్‌.రమేష్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకర రావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్‌పి కార్యాలయంలో...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణను పురష్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌, పోలీస్‌ సంప్రదాయ వందనాల నడుమ జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్‌ డిఎస్‌పి ఎల్‌.శేషాద్రి, రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ శ్రీరాములు, కుమార్‌, సైబర్‌ సెల్‌ ఎస్‌ఐ రవీంద్ర రాజు, ఏఆర్‌, ఎస్‌బి, డిసిఆర్‌బి సిబ్బంది, డిపిఒ స్టాఫ్‌ పాల్గొన్నారు.
మున్సిపల్‌ కార్యాలయంలో...
పార్వతీపురం టౌన్‌ : అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలను వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి రూబెన్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, మహిళా ఉంద్యోగులు, సచివాలయం ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సాలూరు: ఆంద్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, బి.శ్రీనివాసరావు, గొర్లి వెంకటరమణ, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పిరిడి రామకృష్ణ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మహా పురుషుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మండవిల్లి బద్రి పాల్గొన్నారు.