ప్రజాశక్తి-బాపట్ల: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసిన వైసీపీ మహిళ అధ్యక్షురాలు పోతుల సునీత చర్యలను నిరసిస్తూ ఆదివారం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళ విభాగం నాయకురాలు పల్లం సరోజిని ఆధ్వర్యంలో బాపట్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద సునీత దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సరోజిని మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలిపి విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబును విమర్శించే స్థాయి, అర్హత పోతుల సునీతకు లేదన్నారు. ఎక్కడో తెలంగాణలో మారుమూల ప్రాంతంలో ఉన్న సునీతకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయినా ఎమ్మెల్సీ, రాష్ట్ర తెలుగు మహిళ పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు. సునీత అనుభవిస్తున్న పదవులు, హౌదా బాబు పెట్టిన భిక్షే నన్నారు. విశ్వాసం లేకుండా గతం మరిచి ఆయనను విమర్శించడం సిగ్గుచేటన్నారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల జోలికి వచ్చినా, మరొకసారి ఆయన గురించి పిచ్చి వాగుడు వాగినా తగిన బుద్ధి చెబుతామని సరోజిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైమవతి, కాగిత నాగభూషణమ్మ, గ్లోరియట్ సౌపాటి, రుక్మిణి, రాణి, ఝాన్సీ, సుజాత, నజ్మా, రజని, రమాదేవి, నవనీతం, పద్మ, మహాలక్ష్మి పాల్గొన్నారు.










