ప్రజాశక్తి-నగరి: జాతీయ స్థాయిలో జరిగిన బాల్‌బాడ్మింటన్ పోటీల్లో ఆంధ్రా సబ్ జూనియర్స్ జట్టు విజయకేతనం ఎగరవేసింది. అత్యుత్తమ ప్రతిభ కనబరచి వియబావుట ఎగరువేసింది. ఈ మేరకు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజి శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రతి ఏడాది నిర్వహించే పోటీల్లో 24 రాష్ట్రాలకు చెందిన క్రీడా జట్లు పాల్గొన్నాయన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో సబ్ జూనియర్స్ జట్టు తొలి నుంచి ప్రతిభను కనబరుస్తూ అన్ని జట్టును ఓడించి ఫైనల్స్‌కు చేరుకునిందన్నారు. గురువారం జరిగిన ఆఖరి ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర సబ్‌జూనియర్స్ జట్టు తెలంగాణ రాష్ట్ర జట్టుతో తలపడి ఛాంపియన్‌గా నిలిచి గోల్డ్‌మెడల్ సాధించినట్టు వివరించారు. అలాగే డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోను ఆంధ్రజట్టు ఛాంపియన్‌గా నిలిచిందన్నారు. బాలికల జట్టు ప్రతిభను చాటి ఫైనల్‌కు చేరుకున్నా తమిళనాడు జట్టుతో ఓటమి పాలైందన్నారు. దీంతో రన్నర్‌గా నిలిచారన్నారు. రాష్ట్ర బాలుర జట్టులో చిత్తూరు జిల్లా నగరికి చెందిన తేజేష్, బాలికల జట్టులో తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలానికి చెందిన ప్రశాంతి ప్రాతినిధ్య వహించి అత్యుతమ ప్రతిభ చూపినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. వీరిని మంత్రి ఆర్‌కె రోజా ప్రసంశించారు.










