Jul 06,2023 23:50

పతకాలు, ప్రశంసా పత్రాలు చూపుతున్న విద్యార్థులు, చిత్రంలో ఖాసీం, అంబేద్కర్‌రాజు

ప్రజాశక్తి-కె.కోటపాడు
విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగు చూడాలంటే పోటీ పరీక్షల్లో పాల్గొవాలని ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.అంబేద్కర్‌ రాజు అన్నారు. ఇండియన్‌ టాలెంట్‌ ఒలింపియాడ్‌ 2022-2023లో బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు సాధించిన అయ్యన్న స్కూల్‌ విద్యార్థులను ఆయన ప్రశంసించారు. గురువారం అయ్యన్న విద్యాసంస్థల అధినేత డాక్టరు ఖాశీం అధ్యక్షతన పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తరచూ పోటీ పరీక్షల్లో పాల్గొనేలా ప్రోత్సాహానిస్తున్న అయ్యన్న స్కూల్‌ యాజమాన్యాన్ని, ఉత్తమమైన బోధన చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. జాతీయస్థాయి రెండవ రౌండ్లో ప్రతిభ కనబరిచిన ఒకటి నుంచి పది తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను ఆయన అందజేశారు. 2022-2023 విద్యా సంవత్సరంలో అయ్యన్న స్కూల్‌ జాతీయస్థాయిలో గోల్డెన్‌ స్కూల్‌గా నేషనల్‌ ఒలింపియాడ్‌ ఎంపిక చేసి అవార్డు ఇచ్చింది. ఈ అవార్డును డాక్టరు ఖాశీంకు ప్రొఫెసర్‌ అంబేద్కర్‌ రాజు అందచేశారు. బెస్ట్‌ ఇన్స్పైరింగ్‌ ప్రిన్సిపాల్‌గా హరీషా, బెస్ట్‌ ఇన్స్పైరింగ్‌ టీచర్స్‌గా కళ్యాణి, నాగశిరీషకు ఇండియన్‌ టాలెంట్‌ ఒలింపియాడ్‌ ఇచ్చిన అవార్డ్స్‌ను అంబేద్కర్‌ రాజు అందచేశారు. నేషనల్‌ ఒలింపియాడ్‌ టాలెంట్‌ టెస్ట్‌లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన కందివలస జనార్దన్‌ను డాక్టరు అంబేద్కర్‌ రాజు, డాక్టరు ఖాశీం అభినందించారు.