
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పైడితల్లమ్మ ఉత్సవ సందడి మొదలైంది. తొలిరోజు సోమవారం తొలేళ్ల ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి యాత్రికులు పోటెత్తారు. ఉదయం నుంచి దర్శనం కోసం కిలోమీటర్ల క్యూలో నిలబడ్డారు. ఘటాలతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయం నుంచి రోడ్డుకు కుడి వైపు అర్బన్ బ్యాంకు వరకు యాత్రికులు క్యూలో ఉన్నారు. ఎంజి రోడ్డు వైపు చందన బ్రదర్స్ షాపు వరకు బారులుతీరారు. తొలేళ్ల ఉత్సవం సందర్భంగా విచిత్ర వేషధారణలు, వాయిద్యాలతో పండగ శోభ నెలకొంది.
ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. డిసిఎంఎస్ చైర్‌పర్సన్ అవనాపు భావన, విక్రమ్ దంపతులు, బంధుమిత్రులతో కలిసి ఘటాలతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్
పైడితల్లమ్మ పండగ సందర్భంగా సోమవారం అమ్మవారికి ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అశోక్ మీడియాతో మాట్లాడుతూ పైడితల్లమ్మ ముందు అందరూ సాధారణ భక్తులేనని, అధికారం, అహం అమ్మవారి ముందు చూపించకూడదని వ్యాఖ్యానించారు. తానెప్పుడూ మర్యాదలకు పెద్దపీట వేయలేదన్నారు. గతేడాది అనేక అపశ్రుతులు చోటుచేసుకున్నాయని, ఈ ఏడాది అలా జరగ కుండా ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. సిరి మాను సరైన సమయానికి తిప్ప గలిగితే యాత్రికులు సంతోషిస్తారని, ఈ విషయంలో ప్రభుత్వం బాగా పనిచేయాలని సూచించారు. విజయనగరం ఉత్సవాలకు అందరికీ ఆహ్వానం ఇవ్వాలా? వద్దా అనేది ఎమ్‌పి, ఎమ్మెల్యేల నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపడాలి
జిల్లాలో రైలు ప్రమాదం జరగడం విచారకరమని అశోక్ అన్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని మానవత్వంతో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అమాయకుల ప్రాణాలు పోకుండా ప్రభుత్వం రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపర్చాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైలు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు.