ప్రజాశక్తి-అనంతగిరి:ప్రముఖ పర్యాటక కేంద్రాలకు పర్యాటకులు పోటెత్తారు. శనివారం విదేశీ, ఇతర ప్రాంతాలకు చెందిన అనేకమంది బొర్రా గుహలు, కటికి, తాడిగుడా, చిట్టంపాడు, డమ్ముకు, సుంకరమెట్ట యు పాయింట్‌లతో పాటు అనంతగిరి కాఫీ ప్లాంటేషన్‌లో పర్యాటకులు సందడి చేశారు. అనంతగిరి, బిసుపురం, సుంకరమెట్ట ప్రాంతాలలో శనివారం ఉదయం తెల్లవారు జాము నుండి సాయంత్రం వరకు వాహనాల రద్దీ ఏర్పడింది. జలపాతాలు, ఘాట్ రోడ్ యు పాయింట్‌లో కుటుంబ సమేతంగా సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు.
అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయలో శనివారం పర్యాటకులు వేల సంఖ్యలో తరలి రావడంతో సందర్శిత ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. గిరిజన సాంస్కతిక మ్యూజియంలో శనివారం రాత్రి సందడి నెలకొంది. పర్యాటకులు ఒకే సారి తరలిరావడంతో అరకులోయ మ్యూజియం ప్రాంతం ఒక్కసారి గా జన సందోహంతో కిక్కిరిసి పోయింది. పోలీసులు ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సందర్శిత ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా సిఐ జిడి బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. పద్మావతి గార్డెన్, గిరిజన మ్యూజియం, డుంబ్రిగుడ చాపరాయి జలపాతంలో ప్రవేశ టికెట్ల రూపంలో లక్షల్లో ఆదాయం సమకూరింది.










