పండించిన పంటను
పండించినోడు కాక
పాలకుడి కనుసన్నల్లో
కష్టం అంతా కన్నీరై కదిలిపోయే
కుట్రలు కాగితంపైకి వచ్చాక
కర్షకుడి కళ్ళు ఎరుపెక్కాయి
పోరు పిడికిళ్లు బిగుసుకున్నాయి
కాళ్ళు కదనరంగం వైపు దూసుకెళ్లాయి
తప్పిద నిర్ణయాలకు నిరసనగా
డిల్లీ నుంచీ గల్లీ దాకా
రైతు గర్జనలు మిన్నంటాయి
దేశానికి పంటలు ప్రమిదలు అయినప్పుడు
అరచేతులు అడ్డుపెట్టి కాపాడాలి
ఆకలి తీర్చే అన్నదాత అడుగులకు
ఊతం అన్నది నమ్మకమై నిలబడాలి
ఊరించే యేరులా
రైతు నడక సాఫీగా సాగాలి
చిందించిన స్వేదం
నాలుగు రూకలై నవ్వులు పూయించాలి
దేశ వెన్నెముకకు
ప్రభుత్వాలు బాసటగా నిలిచి
మద్దతు ధరను ఆమోదించాలి
రైతు కన్న కలల్ని సాకారం చేయాలి
'జై కిసాన్!' అన్న నినాదాన్ని నిజం చేయాలి...!
- మహబూబ్ బాషా చిల్లెం
9502000415