Jul 30,2023 21:53

జల దిగ్బంధంలో లంక గ్రామాలు
నిండుకుండల్లా ప్రధాన కాలువలు
నీట మునిగిన నారుమడులు, తమలపాకు, కూరగాయల తోటలు
ప్రజాశక్తి - ఆచంట

            వశిష్ట గోదావరి ఉరకలేస్తోంది. ఆదివారం సాయంత్రం నాటికి కోడేరు వద్ద వశిష్ట గోదావరి వరద ఉధృతి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మండల ప్రత్యేక అధికారి డి.వీరాస్వామి, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఎంపిడిఒ జగన్నాధరావు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా 10 క్వింటాళ్ల బియ్యం, ఏడు బస్తాల కందిపప్పు, తొమ్మిది బస్తాల పంచదార, 20 గ్యాస్‌ సిలిండర్లతోపాటు నిత్యావసర సరుకులు ఇంజిన్‌ పడవపై తరలించారు. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెదమల్లంలోని పర్యాటక కేంద్రం, ప్రసిద్ధిగాంచిన మాచేనమ్మ ఆలయాలు వరద తాకిడికి గురయ్యాయి. పల్లపు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. అయితే భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టడంతో సోమవారం సాయంత్రం నుంచి గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లంక గ్రామాల్లో పాముల బెడద ఎక్కువగా ఉందని జనం వాపోతున్నారు. వరద ఉధృతికి పెద్దఎత్తున పాములు లంకల్లోకి వస్తున్నాయని, ఎప్పుడు.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. లంక గ్రామాలకు 80 వేల వాటర్‌ ప్యాకెట్లు సరఫరా చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎఇ ఎం.మూర్తిరాజు తెలిపారు. తాగునీటికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా వాటర్‌ ప్లాంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
ఆచంట మండలం పెదమల్లం పంచాయతీ పరిధిలోని పెదమల్లం లంక, ఆనగార్లలంక, కోడేరు పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం, అయోధ్యలంక పంచాయతీ పరిధిలోని అయోధ్యలంక, మర్రిమూల, పుచ్చల్లంక, నకిడిలంక, రాయిలంక, పెదపేట, వాసులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఉపాధి లేక నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెవిన్యూ అధికారులు వీరికి రెండు పూటలా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. భీమలాపురం ఏటిగట్టు దిగువన ఉన్న కాపులపాలెంను వరద నీరు చుట్టుముట్టింది. ప్రధాన రహదారి నీట మునిగింది. దిగివన ఉన్న కాజ్‌వే పైనుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. పలు అంతర్గత రహదారులు నీట మునిగిపోవడంతో రెండు రోజులుగా ఆ నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ సుమారు వంద కుటుంబాలు వరద తాకిడికి గురయ్యాయి. కాపులపాలెంలో వరద నివాసాలను చుట్టుముట్టడంతో అక్కడ నుంచి 10 కుటుంబాలను స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ఎం.రాజకుమార్‌ తెలిపారు.
నీట మునిగిన పంటలు
లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో నాలుగు అడుగుల మేర నీరు ప్రవహించడంతో కూరగాయలు, అరటి, వంగ, బెండ, బీర, ఆనబ, చిక్కుడు, పచ్చిమిర్చి తోటలతోపాటు ఆకుకూరలు, తమలపాకు తోటలు నీట మునిగాయి. పశువుల పాకలు, పచ్చగడ్డి ముంపుబారిన పడటంతో పశువుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.
యలమంచిలి: గోదావరి వరద మరింత ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని కనకాయలంక, పెదలంక, బాడవ, యలమంచిలిలంక, లక్ష్మీపాలెం, గంగడపాలెం, అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల తదితర గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక గ్రామాల్లోని ప్రజల రాకపోకలకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. దొడ్డిపట్ల హైస్కూలు, తాటిపాక గ్రామంలోని కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా ప్రజలు రావడానికి ఇష్టపడటం లేదని తహశీల్దార్‌ ఎం.సునీల్‌బాబు తెలిపారు. వరద మరికాస్త పెరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న దృష్ట్యా వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
పొంగిపొర్లుతున్న కాలువలు
ముంపులో నారుమడులు, తమలపాకు తోటలు
గోదావరి వరద ప్రభావంతో మండలంలోని నక్కల డ్రెయిన్‌, కాజ డ్రెయిన్లతోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న పిల్ల కాలువలు సైతం పొంగిపొర్లడంతో ఆయా కాలువల వెంబడి ఉన్న పంట పొలాలు నారుమడులు పూర్తిగా నీట మునగడంతోపాటు కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, బూరుగుపల్లి, కెఎస్‌ పాలెం తదితర గ్రామాల్లోని లంకల్లో ఉన్న తమలపాకు తోటలు సైతం నీట మునిగాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వరద ఉధృతిని పరిశీలించిన ఎస్‌పి
పెనుగొండ : గోదావరి వరద ఉధృతిని జిల్లా ఎస్‌పి రవిప్రకాష్‌ ఆదివారం పరిశీలించారు. సిద్దాంతం చేరుకున్న ఆయన రేవు వద్ద నుంచి గోదావరి వరదను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిద్ధాంతం లంక, నడిపూడి లంకల్లో ఎవరైనా నివాసమున్నారా అని ఆరా తీశారు. అక్కడ ప్రజలెవరూ లేరని, పశువులు మాత్రమే ఉన్నాయని సిబ్బంది తెలిపారు. వెంటనే ఆ పశువులను ఏటిగట్టుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎస్‌పి వెంట నరసాపురం డిఎస్‌పి కె.రవి మనోహరాచారి, సిఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్‌, సర్పంచ్‌ చింతపల్లి గన్నరాజు, సిబ్బంది ఉన్నారు.
మరింత పెరిగిన కూరగాయల ధరలు
వరదల ప్రభావం
పాలకొల్లు:గత 10 రోజులుగా గోదావరి వరదలు, భారీ వర్షాలు నేపథ్యంలో కూరగాయల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సాధారణంగా పచ్చిమిర్చి, వంకాయలు, బీర, బెండ, పొట్లకాయ, ఆనప, మునగ వంటి కూరగాయలు లంక గ్రామాల్లో సాగు చేస్తారు. ఇప్పటికే పచ్చిమిర్చి కిలో రూ.160కు చేరి ప్రస్తుతం రూ.100కు తగ్గింది. వంకాయిలు, బెండ తిరిగి కిలో రూ.వందకు చేరాయి. మునగకాడ చిన్నది రూ.పది నుంచి రూ.15 వరకూ అమ్ముతున్నారు. ఆనపకాయ తిరిగి రూ.40 నుంచి రూ.50 మధ్య పలుకుతోంది. వేసవిలో పెరిగిన కూరగాయల ధరలు జులై మొదటి వారంలో కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే వరదల నేపథ్యంలో మళ్లీ ధరలు పెరిగాయి. టమోటాలు డబుల్‌ సెంచరీ బాటలోనే ఉన్నాయి.