ప్రజాశక్తి - కుక్కునూరు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు భారీగా చేరిన వరద నీటిని గేట్లు ఎత్తి దిగువకు వదలడం, ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో శబరి నదికి 31 అడుగుల మేర వరద చేరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరికి భారీగా వరద పోటెత్తుతుంది. భద్రాచలంలో మంగళవారం 39 అడుగులుండగా బుధవారానికి 45 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఓ వైపు వరద ఉధృతంగా పెరుగుతుండటం మరో వైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో బయటకు వచ్చే పరిస్థితి లేక ముంపు మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే తొమ్మిది రోజులుగా కుకునూరు-దాచారం మధ్య గల గుండేటి వాగుకాజ్‌వే ముంపునకు గురికావడంతో 14 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. వరద పెరగడంతో వింజరం-ముత్యాలంపాడు మధ్య గల పాలవాగు కాజ్‌వేపైకి వరద నీరు చేరింది. దీంతో వింజరం, ముత్యాలంపాడు, కౌండిన్యముక్తి వంటి మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా మండలంలోని గొమ్ముగూడెం గ్రామంలోని 253 కుటుంబాలను వరద భయంతో ముందస్తుగానే మండలంలోని రావికుంట పునరావాస కేంద్రానికి తరలించారు. వరద ఉధృతి పెరుగుతుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతుండటంతో ముంపు మండలాల ప్రజల్లో తీవ్ర అలజడి నెలకొంది. వరద పెరిగితే సీతారామనగరం, వేలేరు, చీరవల్లి, వింజరం మధ్య ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరితే భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోతాయి. కౌండిన్యముక్తి, ఎల్లప్పగూడెం, బెస్తగూడెం, కుక్కునూరు 'ఎ' బ్లాక్ గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది.
పోలవరం : పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు, ఇంద్రావతి, శబరి ఉపనదులు, పోలవరం ప్రాజెక్టు ఎగువన కొండవాగులు గోదావరిలో కలుస్తుండటంతో వరద క్రమక్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుండి 8,50,589 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఇఇ పి.వెంకటరమణ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31.940 మీటర్ల నీటిమట్టం, దిగువన 23.570 మీటర్లు, ఎగువ కాపర్‌డ్యామ్ వద్ద 32.660 మీటర్లు, దిగువ కాపర్‌డ్యామ్ వద్ద 23.000 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పోలవరంలో గోదావరి నీటిమట్టం 22.467 మీటర్ల వద్ద నిలకడగా ఉంది.










