ప్రజాశక్తి -పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో గురుకుల విద్యా సంస్థలలో పోస్టుల ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్శ పాడేరు ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.పాడేరు ఐ.టి.డి.ఏ కార్యాలయంలో పిఓ అభిషేక్‌ను ఆదివాసీ గిరిజన సంఘం ప్రతనిధుల బృందం నేతలు కలిసారు. పాడేరు గిరిజన ప్రాంతాల్లో గురుకుల విద్యా సంస్థలలో ఖాళీలను ఆదివాసీలతో భర్తీ చేయకుండా గిరిజనేతరులతో భర్తీకి ఐ.టి.డి.ఏ ద్వారా నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. జీఓ 3 రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారణ దశల్లో ఉండగా ప్రభుత్వ ద్వంద వైఖరితో వ్యహరిస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో గిరిజ నేతురులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారని, గురుకులం లో జారీ చేసిన నోటిఫికేషన్‌తో స్థానిక ఆదివాసీలలో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు.1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులకు ప్రవేశానికి అనుమతి లేనిది, ఉద్యోగం పేరుతో నాన్ ట్రైబల్‌ను ఏజెన్సీ ప్రాంతంలో అనుమతించడం దారుణమన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని పిఒ తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు.










