Sep 29,2023 21:41

రెండో ఎంఇఒల పరిస్థితి అగమ్యగోచరం
నాలుగు నెలలుగా అందని జీతాలు
ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులు సతమతం
ఉమ్మడి జిల్లాలో 47 మంది రెండో ఎంఇఒలు
అక్టోబర్‌లోనైనా జీతాలు అందేనా..!


ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రెండో ఎంఇఒలను ఆర్భాటంగా ప్రభుత్వం నియమించింది. కానీ వారికి జీతాలు ఇవ్వడం మాత్రం పూర్తిగా మరిచారు. గడిచిన నాలుగునెలలుగా జీతాలందక ఎంఇఒ-2 ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యావ్యవస్థ మార్పులో భాగంగా ప్రతీమండలానికి రెండో ఎంఇఒను ప్రభుత్వం నియమించింది. మండలాల్లోని సినీయర్‌ ప్రధానోపాధ్యాయులను ఈ పోస్టుల్లో నియమించింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఎంఇఒలకు అడ్మినిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించగా, నియమించిన ఎంఇఒ-2లకు అకాడమిక్‌ బాధ్యతలు అప్పగించారు. స్కూళ్లకు సంబంధించి అకాడమిక్‌ మోనటరింగ్‌, ఉపాధ్యాయులకు శిక్షణాతరగతులు వంటి పనులను రెండో ఎంఇఒలు చూస్తున్నారు. ఇక్కడ వరకూ భాగానే ఉంది. పోస్టులో చేరిన వీరికి ఇప్పటి వరకూ ప్రభుత్వం జీతాలివ్వలేదు. ఏలూరు జిల్లాలో 27 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మండలానికి ఒకరు చొప్పున మొత్తం 47 మంది రెండో ఎంఇఒలు పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 19వ తేదీన వీరంతా బాధ్యతలు చేపట్టారు. దాదాపు నాలుగు నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకూ జీతాలు అనేవి ఇవ్వలేదు. వీరంతా సీనియర్‌ ప్రధానోపాధ్యాయులే. నెలకు రూ.లక్ష, ఆపైన వరకూ జీతాలు అందుకుంటున్నవారే. నాలుగు నెలలుగా జీతాలందకపోవడంతో ఒక్కోక్కరికి దాదాపు రూ.నాలుగు లక్షలపైనే జీతం పెండింగ్‌లో ఉంది. ఈ జీతాలపై ఆధారపడి జీవించే కుటుంబాలకు నాలుగు నెలలుగా జీతాలు లేకపోతే పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. ఒకటి, రెండు నెలలు అయితే ఏదోరకంగా సర్దుకుంటారు. ఏకంగా నాలుగు నెలలుగా జీతాల్లేకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తమకు వచ్చే జీతాల ఆధారంగా నెలవారీ ఖర్చులు, ఇఎంఐలు వంటివి ఏర్పాటు చేసుకుంటారు. నాలుగు నెలలుగా వేతనాలందకపోవడంతో ఖర్చులు సర్దుబాటు చేసుకోవడం కష్టతరంగా మారింది. కుటుంబ అవసరాలకోసం సైతం అప్పుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబర్‌నెలలోనైనా జీతాలు ఇస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. ఇప్పటి వరకూ వీరికి జీతాలు బిల్లుచేసే డిడిఒ ఎవరనేది కూడా ప్రభుత్వం తేల్చలేదు. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం డిఇఒ కార్యాలయంలో పనిచేసే ఎడిలకు డిడిఒ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ నెల జీతాలు బిల్లుపెట్టే సమయం దాటిపోయింది. దీంతో అక్టోబర్‌ నెలలోనైనా జీతాలందుతాయనేది ప్రశ్నార్థంగానే మిగిలింది. అయితే అక్టోబర్‌ ఆరో తేదీ నుంచి పదోతేదీ మధ్యలో జీతాలకు సంబంధించి సప్లిమెంటరీ బిల్లులు పెట్టుకునే వెసులుబాటు ఉన్నట్లు చెబుతున్నారు. డిడిఒ బాథ్యతలను ప్రభుత్వం తేల్చడంతో వెంటనే జీతాల బిల్లులు పెడతారా.. లేక మరింత ఆలస్యమవుతుందో తెలియడం లేదు. జిల్లాలో చాలా మండలాలకు రెగ్యులర్‌ ఎంఇఒలు లేరు. వేరే మండలాల్లో పనిచేస్తున్న ఎంఇఒలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తమమండలంతోపాటు వేరే మండలంలోని బాధ్యతలు నిర్వహించడం కష్టంగా మారింది. రెగ్యులర్‌ ఎంఇఒలు లేని మండలాల్లో రెండో ఎంఇఒగా నియమితులైన ఉద్యోగులకు పనిభారం సైతం ఎక్కువగానే ఉంటుంది. అకాడమిక్‌కు సంబంధించిన ఇబ్బందుల పరిష్కారంలో ఎంఇఒ-2 ఉద్యోగులు పనితీరు భాగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఎంఇఒ-2 ఉద్యోగులకు నాలుగునెలలుగా జీతాలు ఇవ్వకపోవడం మాత్రం విద్యాశాఖలో తీవ్రచర్చనీయాంశంగా మారింది. అక్టోబర్‌ నెలలో కూడా జీతాలు అందకపోతే ఉద్యోగులు ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడనుంది.