ప్రజాశక్తి-పాడేరు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనపై ఈ నెల 14న సీలేరు లో ప్రజా పోరుబాట పాదయాత్ర ప్రచార భేరి ప్రారంభించి 24 వరకు కొనసాగుతుందని సిపిఐ అల్లూరి జిల్లా కార్యదర్శి .పొట్టిక సత్యనారాయణ, సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ వెల్లడించారు. గురువారం పాడేరులోని సిపిఎం కార్యాలయంలో ఇరు పార్టీల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ కార్పొరేట్, మతోన్మాద విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు.అధిక ధరలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, జిఎస్టితో భారాలు తదితర వాటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వీటితోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో పాటు అదనపు భారాలు బిజెపి మోపుతుందన్నారు. విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తుందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, .పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణం, .వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వక పోవడంతో రాష్ట్రం వెనుక బడుతుందన్నారు. ప్రశ్నించే గొంతుక అని ముందుకు వచ్చిన జనసేన పార్టీ కూడా ప్రశ్నించ లేదని ఆరోపించారు. గిరిజన ప్రాంతంలో సహజ సిద్ధంగా పండిన పంటలకు చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. జీవో 3కి చట్టబద్ధత కల్పించాలని, 100శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలన్నారు. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజన గ్రామాల్లో తాగు సాగునీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. అల్లూరి జిల్లాలో శిశు మరణాలు అరికట్టి, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, హాస్టల్లో హెల్త్ అసిస్టెంట్లను నియమించి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరారు. కొండ పోడు సాగు చేస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలన్నారు.సిపిఐ, సిపిఎం సాగిస్తున్న పోరుబాట పాదయాత్రను ప్రజలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 14 న సీలేరులో ఉదయం 11 గంటలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా పూల మాలలు వేసి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. పది రోజులపాటు పాడేరు నియోజకవర్గం జీకే వీధి, కొయ్యూరు, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మండలాల పరిధిలో పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. 24న పాడేరులో పాదయాత్ర ముగుస్తుందన్నారు. అదే రోజు ప్రజల నుండి వచ్చిన సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఎల్ సుందర్రావు, .దీనబంధు, పాంగి ధనుంజరు, జి సత్యనారాయణ, సిపిఐ నేతలు కూడా రాధాకృష్ణ, కె సింహాచలం, డి.సతీష్ పాల్గొన్నారు.
ప్రచార బేరి పోస్టర్ ఆవిష్కరణ
పాడేరు: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ, మోడీని గద్దె దింపండి- దేశాన్ని కాపాడండి అనే నినాదంతో వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న ప్రజా పోరుబాట పాదయాత్రపై ప్రచార బేరి పోస్టర్లను గురువారం పాడేరులో వామపక్ష నాయకులు ఎల్ సుందర్రావు, రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నిర్వహిస్తున్న ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి మతోన్మాద, కార్పోరేట్ అనుకూల, ప్రైవేటీకరణ విధానాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాపాడి, ఏపీకి ప్రత్యేక హౌదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు బాలన్న, వరహాలు బాబు పాల్గొన్నారు.










