ఉద్యోగ విరమణ కార్యక్రమంలో వక్తలు
ప్రజాశక్తి - మండవల్లి
ఉత్తరాలు అందించే పోస్ట్‌మెన్‌గా పోతర్లంక వీరనాగేశ్వరరావు విశిష్ట సేవలందించారని సుధామ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ విజయకుమార్ తెలిపారు. స్థానిక పోస్టాఫీస్‌లో గురువారం నిర్వహించిన వీర నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వీరనాగేశ్వరరావు 44 ఏళ్ల పాటు పోస్ట్‌మెన్‌గా పని చేశారన్నారు. ఇంటింటికి తిరిగి ఉత్తరాలను అందించారన్నారు. ఉత్తరాలు అందించే క్రమంలో ఆయన ఎంతో మర్యాదగా నడుచుకుంటూ చిరునవ్వుతో అందరిని అప్యాయంగా పలకరించేవారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సభ్యులు ఎల్‌ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం గల మనిషి నాగేశ్వరరావు అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆనందంగా గడుపుతూ కొంత సమయం పర్యావరణ పరిరక్షణలో, ప్రజాసేవలో కొనసాగాలని ఆయన కోరారు. చిరకాలం గుర్తుండిపోయేలా రాజ్యాంగంతో పాటు మంచి మంచి పుస్తకాలు, పచ్చటి మొక్కను అందించి మొక్కను నాటి సంరక్షించాలని ఆయన తెలిపారు. అనంతరం నాగేశ్వరరావు దంపతులను దుశ్శాలువాలతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల అధ్యక్షులు అప్పారావు, పిఎసిఎస్ అధ్యక్షుడు గోకర్ణ యాదవ్, రిటైర్డ్ టీచర్ బి.కొండయ్య, రామ్‌మోహన్, మెండ సురేష్, మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి సబ్ పోస్ట్‌మాస్టర్లు పాల్గొన్నారు.










