Oct 25,2023 21:49

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం దసరా పండుగకు పోస్టల్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్‌ పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రాజమహేంద్రవరం పోస్టల్‌ డివిజనల్‌ కార్యాలయం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం తపాలా డివిజన్‌ గ్రూప్‌ సి యూనియన్‌ కార్యదర్శి బి. కొండబాబు మాట్లాడుతూ దసరా ముందు ఉద్యోగులకు చెల్లించ వలసిన బోనస్‌ను ఇంకా ప్రకటించక పోవటం దుర్మార్గమని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా బోనస్‌ చెల్లించకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. లక్ష్యాల పేరుతో అనునిత్యం ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తున్న అధికారులు, తపాలా ఉద్యోగులకు చెల్లించ వలసిన బోనస్‌ విషయంలో స్పందించకపోవడం సరికాదన్నారు. బోనస్‌ను వెంటనే చెల్లించాలని డిమండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు యుజి.ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నలుమూలల నుండి పెద్ద సంఖ్య ఉద్యోగులు పాల్గొన్నారు. రంపచోడవరం, రామచంద్రపురం తపాలా కార్యాలయాల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి.