ఈ వర్షాల్లోనే పుట్టలపై మొలిచేవి పుట్టగొడుగులు. సహజంగా పెరిగినవి రుచి కూడా బాగుంటాయి. ఫామ్స్‌లో పెంచే పుట్టగొడుగుల్లో అయినా పోషకాలు ఉంటాయి. ఏమైనా పోషకాలు అందించే పుట్టగొడుగులను ఎలా వండుకోవాలో చాలామందికి తెలియదు. అలాంటి వారికోసం కాస్త వెరైటీ రుచులు ...
పిజ్జా
కావాల్సిన పదార్థాలు : బేస్ కోసం: మైదా- 2 కప్పులు, డ్రై ఈస్ట్- 2 స్పూన్లు, చక్కెర- స్పూను, నూనె- ఒకటిన్నర స్పూన్, పాలు- 1/4 కప్పు, ఉప్పు- కొద్దిగా.
టాపింగ్ కోసం: క్యాప్సికం- 2, పుట్టగొడుగు ముక్కలు- ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ- ఒకటి, ఆలివ్‌లు- పన్నెండు, చీజ్ తరుగు- 2 కప్పులు, సాస్ - పావుకప్పు, డ్రైడ్ ఆరెగానో- స్పూన్, మిరియాల పొడి- 1/2 స్పూన్, ఆలివ్‌నూనె- కొద్దిగా, ఉప్పు- సరిపడా.
తయారుచేసే విధానం :
ముందుగా బేస్ తయారుచేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లలో చక్కెర, ఈస్ట్, పాలు, నూనె, ఉప్పు, మైదా కలిపి వేడిచేయాలి. తర్వాత వేడి ప్రదేశంలో ఉంచితే కాసేపటికి పిండి పొంగుతుంది. ఈ మిశ్రమాన్ని మూడు భాగాలుగా చేసుకోవాలి.
ఓ గిన్నెలో మష్రూమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, ఆలివ్‌నూనె, ఆలివ్‌లు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి.
మైదా ఉండను చపాతీలా చేసుకుని దానిపై ఆలివ్‌నూనె, తర్వాత సాస్ రాసి చీజ్ తరుగు, మష్రూమ్స్ ముక్కల్ని వేయాలి.
దానిపై చీజ్ చల్లి డ్రైడ్ ఆరెగానో చల్లి 20 నిమిషాలు బేక్ చేయాలి.
సూప్
కావాల్సిన పదార్థాలు : మష్రూమ్స్- అరకేజీ, నిమ్మరసం- స్పూను, ఉప్పుకలపని వెన్న- స్పూను, ఉల్లిపాయలు చిన్నవి- ఆరు, డ్రైడ్ ధైమ్ / పుదీన- స్పూను, బిర్యానీ ఆకు- ఒకటి, మిరియాల పొడి- స్పూను, కూరగాయలు ఉడికించిన నీరు- కప్పు, కొత్తిమీర తరుగు- అలంకరణ కోసం, ఉప్పు- తగినంత.
వైట్‌సాస్ కోసం: ఉప్పు కలిపిన వెన్న- స్పూను, పాలు- రెండున్నర కప్పులు, మైదా- రెండు స్పూన్లు, క్రీం- పావుకప్పు.
తయారుచేసే విధానం :
ముందుగా వైట్‌సాస్ కోసం వెన్నను కరిగించి అందులో మైదా వేసి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా క్రీం, పాలు పోసి మంట తగ్గించాలి. ఇది సాస్‌లా చిక్కగా తయారయ్యాక దింపేయాలి.
నాలుగైదు మష్రూమ్ ముక్కల్ని పాన్‌లో వేయించి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటిని మిక్సీలో వేసి, నిమ్మరసంతో కలిపి మెత్తని గుజ్జులా చేసుకోవాలి.
వెన్న కరిగించి ఉల్లిపాయ ముక్కల్ని, మెత్తని గుజ్జూ, థైమ్, బిర్యానీ ఆకును వేయించాలి. రెండు నిమిషాలయ్యాక ఉప్పు, మిరియాల పొడి, మిగిలిన క్రీం, కూరగాయలు ఉడికించిన నీరు పోయాలి.
చిక్కబడ్డాక వైట్‌సాస్ వేసి, కాసేపు సూప్ మరగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, వేయించిన పుట్టగొడుగు ముక్కలతో అలంకరించాలి.
రోల్స్
కావాల్సిన పదార్థాలు : ఫిల్లింగ్ కోసం: ఉల్లిపాయలు- రెండు, కొత్తిమీర తరుగు- 1/4 కప్పు, వెల్లుల్లి ముక్కలు- ఒకటిన్నర స్పూన్, పాలకూర తరుగు- కప్పు, పుట్టగొడుగు ముక్కలు- 2 కప్పులు, ఉల్లికాడలు - 1/4 కప్పు, మిరియాల పొడి- స్పూన్, ఉప్పు- తగినంత, నూనె- 2 స్పూన్లు, లవంగాలు- కొన్ని.
వైట్‌సాస్ కోసం : ఉప్పు కలిపిన వెన్న- స్పూను, మైదా- స్పూను, పాలు- 3/4 కప్పు, చీజ్ తరుగు-1/2 కప్పు.
పాన్‌కేక్ కోసం: మైదా- 2 కప్పులు, గుడ్లు- 2, నీళ్లు- రెండున్నర కప్పులు, ఉప్పు- సరిపడా, బ్రెడ్‌పొడి- 2 కప్పులు, నూనె- సరిపడా.
తయారుచేసే విధానం :
ముందుగా ఫిల్లింగ్ చేసుకోవాలి. పాన్‌లో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, కొత్తిమీర తరుగు, వెల్లుల్లి ముక్కలు వేగించాలి. తర్వాత పుట్టగొడుగుల ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చల్లి, మూత పెట్టాలి.
అవి మెత్తగా అయ్యాక పాలకూర తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడకనించి, దింపేయాలి.
వైట్‌సాస్ కోసం పాన్‌లో వెన్నను కరిగించి, మైదా వేసి వేగించుకోవాలి. మైదాలో పచ్చివాసన పోయాక పాలు, చీజ్ పుట్టగొడుగుల కూరలో కలపాలి.
పాన్‌కేక్‌ల కోసం పిండి సిద్ధం చేసుకునేందుకు మైదా, నీళ్లూ, గుడ్ల పచ్చసొనా, ఉప్పూ ఓ గిన్నెలో తీసుకుని గిలకొట్టాలి. దాన్ని పెనం మీద దోశలా వేసి ఒకవైపే కాల్చుకోవాలి.
దానిపై పుట్టగొడుగుల మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, రోల్‌లా చుట్టుకోవాలి. అంచుల్లో లవంగాన్ని గుచ్చి దీన్ని గుడ్డులోని తెల్లసొనలో ముంచి, తర్వాత బ్రెడ్‌పొడి అద్ది కాగుతోన్న నూనెలో ఎర్రగా వేయించాలి.
క్విచీ
కావాల్సిన పదార్థాలు :
టార్ట్స్ కోసం: మైదా- కప్పు, వెన్న- 100 గ్రా., బేకింగ్‌పౌడర్- 2 స్పూన్లు, నీళ్లు- కొంచెం, ఉప్పు- కొద్దిగా, టార్ట్ చేసే పాత్ర.
ఫిల్లింగ్ కోసం: ఉల్లిపాయలు- 3, పుట్టగొడుగులు- 1/4 కేజీ, ఉల్లికాడల తరుగు- మూడు స్పూన్లు, మిరియాలపొడి- 1/2 స్పూను, ఉప్పు- తగినంత, నూనె- 1/4 కప్పు, చీజ్ తరుగు- 1/2 కప్పు, గుడ్లు- 2, పాలు- 1/2 కప్పు.
తయారుచేసే విధానం :
ఓవెన్‌ని 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేయాలి. మైదా, ఉప్పు, బేకింగ్‌పౌడర్, చల్లని వెన్న వేసి కలిపి, తర్వాత కొద్దిగా నీళ్లుపోసి, పిండిలా కలిపి ఇరవై నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి.
పాన్‌లో ఉల్లిపాయ ముక్కల్ని వేయించి, అందులో ఉప్పు, మిరియాల పొడి, పుట్టగొడుగు ముక్కలు, ఉల్లికాడల తరుగు వేసి, మెత్తగా అయ్యాక దింపేయాలి.
గిలక్కొట్టిన గుడ్లసొన, పాలు, చీజ్ తరుగును ఓ గిన్నెలో కలిపి పెట్టుకోవాలి. టార్ట్ పాత్రకు కొద్దిగా నూనెరాసి ఫ్రిజ్‌లో ఉంచిన మైదా మిశ్రమాన్ని అందులో సగం వరకు నింపాలి.
దానిపై పుట్టగొడుగుల మిశ్రమాన్ని టాపింగ్‌లా రాసి గుడ్డుసొన, పాల మిశ్రమాన్ని దానిపై వేసి ఓవెన్‌లో అరగంటసేపు బేక్ చేయాలి.