Jan 23,2022 12:18

ప్రపంచమంతా ఒమిక్రాన్‌ అలజడి మొదలైంది. దాని బారిన పడకుండా ఉండాలంటే మనలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అన్నింటిలోకీ పోషక విలువల పరంగా చూస్తే బొప్పాయిదే అగ్రస్థానం. అయితే పండిన తరవాతే ఎక్కువమంది వాటిని వినియోగిస్తారు. కానీ పచ్చి కాయలతోనూ రుచికరమైన, వెరైటీ వంటలు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
                                                                     

                                                                         రొట్టె

పోషకాల బొప్పాయి

కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి- రెండు కప్పులు, రవ్వ - పావుకప్పు, పచ్చి బొప్పాయి తురుము- కప్పు, ఉల్లిముక్కలు- అరకప్పు, క్యారెట్‌ తురుము- అరకప్పు, పచ్చిమిర్చి ముక్కలు- స్పూను, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, అల్లం పేస్టు- అరస్పూను, జీలకర్ర- స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.
 

తయారుచేసే విధానం :
వెడల్పాటి గిన్నెలో బియ్యం పిండి, రవ్వ, పచ్చి బొప్పాయి తురుము, ఉల్లి, క్యారెట్‌, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్టు, జీలకర్ర, ఉప్పును వేసి బాగా కలపాలి.
అందులో అవసరమైనన్ని నీళ్లు పోస్తూ ముద్దగా కలుపుకోవాలి.
కాస్త పిండిని తీసుకుని రొట్టెలా తట్టుకుని, పెనంమీద వేయాలి. దాని పైన, అంచుల్లో కాస్త నూనెను వేయాలి.
రొట్టె అటూ, ఇటూ తిప్పుతూ కాలిస్తే పచ్చి బొప్పాయి రొట్టె సిద్ధం.
మిగతా మొత్తం పిండిని ఇలాగే రొట్టెలుగా కాల్చాలి.

                                                                     ఆవకాయ

పోషకాల బొప్పాయి

కావాల్సిన పదార్థాలు :  పచ్చిబొప్పాయి ముక్కలు- పెద్ద కప్పు, నూనె- నాలుగు స్పూనులు, నిమ్మరసం - రెండు స్పూనులు, కారం- స్పూను, ఉప్పు- తగినంత, ఆవపిండి- పావుస్పూను, మెంతిపిండి- పావుస్పూను, ఇంగువ- చిటికెడు, పసుపు- చిటికెడు.
 

తయారుచేసే విధానం : ముందుగా పొడిగిన్నెలో బొప్పాయి ముక్కలు వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నిమ్మరసం, నూనె వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
ఉప్పు కాస్త ఎక్కువ తినేవారు మరికాస్త వేసుకోవచ్చు. రెండోరోజుకు ముక్క ఊరి, పచ్చడి తినడానికి బాగుంటుంది. ఇష్టమైనవారు స్పూను వెల్లుల్లి తురుము కూడా వేసుకోవచ్చు.
అంతే సింపుల్‌గా తయారయ్యే బొప్పాయి ఆవకాయ రెడీ..! ఇది మధుమేహ రోగులకు మంచి ఔషధంగానూ పనిచేస్తుంది.

                                                                         హల్వా

పోషకాల బొప్పాయి

కావాల్సిన పదార్థాలు :  పచ్చి బొప్పాయి- ఒకటి, నెయ్యి -150 గ్రా., పంచదార - 250 గ్రా., పచ్చి కోవా- 100 గ్రా., డ్రైఫ్రూట్స్‌ - కప్పు.
తయారుచేసే విధానం :
ముందుగా పచ్చి బొప్పాయిని తురుముకోవాలి.
తర్వాత పాన్‌లో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ వేగించి, పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో బొప్పాయి తురుము వేసి, పచ్చివాసన పోయే వరకు వేగించాలి.
అందులోనే కొంచెం పాలు పోయాలి. దగ్గర పడిన తర్వాత కోవా వేసి, ఉడికించాలి.
చివరగా పంచదార వేయాలి. తర్వాత డ్రైఫ్రూట్స్‌ వేసుకోవాలి. కావాలంటే ఫుడ్‌ కలర్‌ వేసుకోవచ్చు.
అంతే రుచికరమైన పచ్చి బొప్పాయి హల్వా రెడీ.

                                                                      పులుసు

పోషకాల బొప్పాయి

కావాల్సిన పదార్థాలు :  కొద్దిగా పండిన బొప్పాయి- సగం ముక్క, మునక్కాయ-ఒకటి, బెండకాయలు- మూడు, బచ్చలి ఆకులు- ఎనిమిది, కొత్తిమీర- కట్ట, పచ్చిమిర్చి- నాలుగు, బెల్లం- నిమ్మకాయంత, చింతపండు రసం- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, పసుపు- చిటికెడు, బియ్యప్పిండి లేదా శనగపిండి- రెండు స్పూన్లు.
 

పోపు కోసం :
ఆవాలు- స్పూను, మెంతులు- అరస్పూను, ఎండుమిర్చి- రెండు, నూనె- రెండు స్పూన్లు.
 

తయారుచేసే విధానం :
ముందుగా బొప్పాయిని చెక్కు తీసి, పెద్దపెద్ద ముక్కలుగా తరగాలి.
బెండకాయలు, మునగకాయనూ ముక్కలుగా తరుక్కోవాలి. ఇంకా బచ్చలి ఆకు సన్నగా, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
ఈ ముక్కలన్నీ ఓ గిన్నెలో వేసి ముక్కలు మునిగే వరకూ నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి కొద్దిగా ఉడికించాలి.
తర్వాత చింతపండు రసం, బెల్లం వేసి మరికాసేపు ఉడికించాలి.
ముక్కలు ఉడికిన తరువాత అరకప్పు నీళ్లలో శనగపిండిని ఉండలు కట్టకుండా కలిపి, పులుసులో వేయాలి.
పిండి వేసిన తరువాత ఐదు నిమిషాలు ఉడికించి, స్టౌ ఆపాలి.
తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి వేయాలి.
ఇప్పుడు పులుసును తాలింపు వేస్తే సరి !