ప్రజాశక్తి-పాడేరు:వైఎస్సార్ సంపూర్ణ పోషకాహారంతో బాలింతలు, గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సుర్యలక్ష్మి తెలిపారు. చింతపల్లి మండలం కుమారవం, కొత్తూరుబయలు, కురమానపాకలు, అన్నవరం తదితర అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ, రక్త హీనతతో భాద పడుతున్న గర్భిణీలు, తక్కువ బరువున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఆదేశించారు. నాణ్యమైన సరుకులు సరఫరా చేయకపోతే వెంటనే తెలియ చేయాలని సూచించారు. నాడు-నేడు కింద చేపట్టిన పనుల ప్రగతిని పరిశీలించి త్వరితగతిన భవన నిర్మాణాలు పూర్తి చేయించాలన్నారు. నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాలలో హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో గర్భిణీలు, బాలింతలతో చర్చించి తగు ఆరోగ్య సూచనలు, జాగ్రత్తలు తెలియజేసారు. ఆయా కేంద్రాలలో అందిస్తున్న సేవలపై ఆరా తీసారు. ప్రతి నెలా 25గుడ్లు, ఐదు లీటర్ల పాలు, మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఆయిల్ ఇస్తున్నదీ లేనిదీ ఆరా తీసారు. క్రమం తప్పకుండా ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. ప్రీ-స్కూల్ యాక్టివిటీస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సిడిపిఓ రమ్య, సూపర్వైజర్ చిన్నారి పాల్గొన్నారు.










