Nov 06,2022 00:01

సమావేశంలో అధికారులతో మాట్లాడుతుఏన్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి- పాడేరు:అంగన్వాడి కేంద్రాల్లో లబ్దిదారు లకు పోషకాహారం పంపిణీలో జాప్యం తగ్గదని, పాలు పంపిణీ చేయకుండా కేంద్రాలలో నిల్వలు ఉంచితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ హెచ్చరించారు. ప్రతీ నెలా బాలింతలకు, గర్భవతులకు, చిన్నారులకు బలవర్ధకమైన పోషకాహారాలను సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎనిమియా నివారణకు పటిష్టమై చర్యలు తీసుకోవాలని సూచించారు. పాడేరు డివిజన్‌ పరిధిలోని 11 మండలాల సిడిపిఓలు, సూపర్‌ వైజర్లతో శనివారం కలెక్టర్‌ కార్యాలయపు సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పోషకాహరం పంపిణీపై సమావేశం నిర్వహించారు. అక్టోబరు నెలకు సంబంధించిన పాలు, గుడ్లు, సంపూర్ణ పోషణ ప్లస్‌ పూర్తి స్థాయిలో లబ్దిదారులకు పంపిణీ చేసామని ధృవీకరణ పత్రం సమర్పించాలని సిడిపి ఓలను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న సరకులు ఎక్కడా నిల్వ ఉండటానికి లేదని స్పష్టం చేసారు. చిన్న పిల్లలకు పాలు సరఫరాలో జాప్యం చేయకూడదన్నారు. లబ్దిదారులు అంగన్వాడీలకు ఏకారణం చేతనైనా రాకపోతే ఇళ్లకు సరుకులు పంపించాలని ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాలకు డీలర్లు ఆయిల్‌ను సకాలంలో పంపిణీ చేయలేదని సిడిపి ఓలు కలెక్టర్‌ దృష్టికి తీసుకుని వచ్చారు. బియ్యం, ఆయిల్‌ పంపిణీలో సమస్యలుంటే తహశీల్దార్లకు, సబ్‌ కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సిడిపిఓలకు సూచించారు. పాలు పంపిణీ చేయడానికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంకండరీ ట్రాన్స్పోర్టేషన్‌ కు ఎన్ని వాహనాలు ఉన్నాయి? నెలకు ఎన్ని వాహనాలు పెట్టాలి, ఎన్ని పెడుతున్నారని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో వాహనాలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కాంట్రాక్టరు పైనే ఉందన్నారు.సిడిపిఓలు క్లస్టర్ల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సూపర్‌ వైజర్‌లు నెలకు 20 అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ సక్రమంగా పంపిణీ చేసి రక్తహీనత లోపాలను నివారించాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు పనిచేయకుండా బినామీలతో పని చేయడానికి వీలు లేదన్నారు. గర్భవతుల ప్రసవ సమయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ సేవల్లో మహిళా పోలీసులను వినియోగించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో నాడు నేడు పనులకు ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసిందని కలెక్టర్‌ తెలిపారు. పనులు పూర్తి చేయాలన్నారు. సూపర్‌ వైజర్లు, సిడిపిఓలు, అంగన్వాడీ భవన నిర్మాణాలను పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం గర్భవతులకు బాలింతలకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ను పంపిణీ చేసారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్‌ పిడి సూర్యలక్ష్మి, సిడిపి ఓలు, సూపర్‌ వైజర్లు పాల్గొన్నారు.