Nov 23,2021 06:54

    నాలుగున్నరేళ్ల క్రితం విజయవాడలో విఆర్‌ఏల మహా ధర్నా జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి స్వయంగా హాజరై జోరుగా హామీలిచ్చారు. తాము అధికారం లోకి రాగానే విఆర్‌ఏలకు జీతం పెంపుదల, నామినీల సమస్య తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. అధికారం లోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచినా, నాటి హామీ లేవీ అమలు చేయలేదు. పైగా ఈ ప్రభుత్వం వచ్చాక సమస్యలు మరింతగా పెరిగాయని ఇటీవల గుంటూరు డివిజన్‌లో 6 రోజులపాటు జరిగిన బైక్‌ యాత్ర సందర్భంగా విఆర్‌ఏలు అభిప్రాయపడ్డారు.
     రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వీరికి పిఆర్‌సి వర్తించదు కాబట్టి ప్రతిసారీ జీతం పెంపుదల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా, పోరాటాలు చేయాల్సి వచ్చింది. గత రెండున్నరేళ్ళలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ అధికారులకు, మంత్రులకు జీతాల పెంపుదల కోసం అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా, పెడచెవిన పెట్టడంతో పోరాడక తప్పలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం రూ. 21 వేలకు పెంచాలని విఆర్‌ఏలు కోరుతున్నారు.
     ప్రతి 6 నెలలకోసారి విఆర్‌ఏలకు డిఏ రూపంలో రూ.300 పెంచాల్సి ఉంది. ఎన్నికల నాటికి 3 డిఏలు పెండింగ్‌లో ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా డిఏ ఇవ్వలేదు. పైగా టిడిపి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డిఏ జీవోలో సాంకేతిక లోపాన్ని కారణంగా చూపి ఆ జీవో ప్రకారం చెల్లించిన డిఏ కి సంబంధించి ప్రతి విఆర్‌ఏ సుమారు రూ. 9 వేలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని, లేనట్లయితే జీతాలు నిలిపివేస్తామని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
    రెవిన్యూ శాఖలో ఖాళీగాఉన్న అటెండర్‌, వాచ్‌మెన్‌ తదితర 4వ తరగతి ఉద్యోగుల పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు ఉన్న కాలంలో ఖాళీ అయిన పోస్టులలో 20 శాతం విఆర్‌ఏ లకు ప్రమోషన్‌ ద్వారా ఇవ్వాలని నిబంధన ఉంది. ఈ ప్రమోషన్లు అనేక సంవత్సరాల నుండి ఇవ్వడంలేదు. దాదాపు 25 ఏళ్ళ నుండి ప్రత్యక్ష నియామకాలు కూడా లేవు. అందువల్ల మొత్తం అటెండర్‌, వాచ్‌మెన్‌ పోస్టులను విఆర్‌ఏ లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని కోరుతున్నారు.
    ప్రస్తుతం పని చేస్తున్న విఆర్‌ఏ లలో ఉన్నత విద్యార్హతలు కలిగినవారు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ప్రమోషన్‌కు అర్హత కలిగిన విఆర్‌ఓ పోస్టులన్నీ ఇటీవలే భర్తీ అయిపోయినందున మరో 15 ఏళ్ళ పాటు వీరికి ప్రమోషన్‌ అవకాశాలు లేవు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విఆర్‌ఓలకు డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లతో నిమిత్తం లేకుండా సీనియర్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఉన్నత విద్యావంతులైన విఆర్‌ఏలకు కూడా జూనియర్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు.
     తహసీల్దారు కార్యాలయాల్లోనూ, రెవిన్యూ అధికారుల ఇళ్ళల్లోనూ గతంలో విఆర్‌ఏలు వెట్టిచాకిరి చేయాల్సి వచ్చేది. విఆర్‌ఏల సంఘం ఏర్పాటు చేసుకున్న తొలినాళ్ళలోనే ఈ వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడి ఉత్తర్వులు సాధించుకున్నారు. అయినా నేటికీ తహసీల్దారు కార్యాలయాల్లో వాచ్‌మెన్‌, అటెండర్‌, డ్రైవర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తదితర పోస్టులలో విఆర్‌ఏల చేత అనధికారికంగా బలవంతంగా డ్యూటీలు చేయిస్తున్నారు. ఇలాంటివారు ప్రతి మండలంలో ఇద్దరు నుండి 8 మంది వరకు పని చేస్తున్నారు. వీరికి తమ గ్రామాల నుండి వచ్చిపోయేందుకు రవాణా భత్యంగానీ, భోజన ఖర్చులుగానీ చెల్లించడంలేదు. ఈ వెట్టిచాకిరి విధానాన్ని రద్దు చేయాలని, ఆయా పోస్టులలో విఆర్‌ఏ లకు ప్రమోషన్లు ఇచ్చి పని చేయించుకోవాలని కోరుతున్నారు.
     అనారోగ్యంతో ఉన్న విఆర్‌ఏల స్థానంలో వారి కుటుంబ సభ్యుల చేత అధికారులు పని చేయిస్తున్నారు. కొన్ని చోట్ల చదువు లేని విఆర్‌ఏల కంటే చదువుకున్న వారి కుటుంబ సభ్యులతో అదనంగా పని చేయించుకోవచ్చని అధికారులు ఇలాంటి పనులను పోత్సహిస్తున్నారు. ఇలా పని చేసేవారి పేర్లు అధికారిక రికార్డుల్లో ఉండకపోవడంవల్ల వీరిని నామినీలుగా పిలుస్తున్నారు. విఆర్‌ఏలు 65 ఏళ్ళ వయస్సు దాటిన తరువాత చనిపోయినా, నామినీలుగా పని చేస్తున్నవారు కొడుకు లేదా, కూతురు కాకపోయినా...వారికి ఆ పోస్టులు వచ్చే అవకాశం లేదు. దీనివల్ల వేరే ఉద్యోగం చూసుకోవాల్సిన వయస్సులో నామినీగా పని చేసి, విఆర్‌ఏ మరణానంతరం ఏ పనీ లేని వారిగా తయారవుతున్నారు. వీరికి తెలంగాణలో ఇచ్చిన విధంగా విఆర్‌ఏ పోస్టులు ఇవ్వాలని కోరుతున్నారు.
     పెద్ద సంఖ్యలో విఆర్‌ఎ పోస్టులు ఖాళీగా వుండడంతో...ఈ పని భారాన్ని మొత్తం సర్వీసులో ఉన్న వారు మోయాల్సి వస్తున్నది. కావున ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరుతున్నారు. విఆర్‌ఏల సమస్యల పరిష్కారం పట్ల అలసత్వాన్ని వీడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యలు పరిష్కరించాలని, లేనట్లయితే పోరు తప్పదని విఆర్‌ఏలు హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 24న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు.
 

/వ్యాసకర్త : గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం,
గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులు/

వై. నేతాజి

వై. నేతాజి